ఖమ్మం అర్బన్, నవంబర్ 4: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి వేలాది మంది విద్యార్ధులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్ చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందన్నారు. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్ష్మణ్, లోకేశ్, నాగుల్‌మీరా, మధు, శివ, వంశీ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.