ఖమ్మం రూరల్/ అశ్వారావుపేట/ దమ్మపేట రూరల్/ కారేపల్లి/ ఎర్రుపాలెం/ మధిర/ బోనకల్లు/ ఖమ్మం కమాన్‌బజార్, మార్చి 30 : సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆశా కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడం, ఇళ్లలో నిర్బంధించడంపై ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసనలు తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందజేసి తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో హైదరాబాద్‌కు వెళ్లిన వందలాది మంది ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా ఆయా మండలాల్లో కొంతమందిని వారివారి ఇళ్లలోనే నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పీ మోహన్‌రావు, బల్లూరి మధు మాట్లాడుతూ సీఐటీయూ ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ విజయలక్ష్మి, ఇతర నాయకులను పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
అధికారంలోకి వస్తే నెలకు రూ.18 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఆశాలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు జ్యోతి, సుభద్ర, ఉమ, నాగమణి, శరభమ్మ, లీలావతి, సుజాత, మమత పాల్గొన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలతోపాటు పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని కోరారు. తహసీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
భారతి, శిరోమణి, మంగ, శ్రవంతి, దుర్గ, రాములమ్మ, ప్రభావతి, రఘు, శారద, రాధ, శ్రీలత పాల్గొన్నారు. కారేపల్లిలో నిర్వహించిన రాస్తారోకోలో సీఐటీయూ మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల సమస్యలను పరిషరించాలని, లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఎల్లబోయిన రాధ, వాంకుడోత్ కమల, జంగా కళ్యాణి, సరస్వతి, చంద్రమ్మ, దేవి, మేదరి కుమారి, పద్మ, భారతి, అచ్చమ్మ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ పోరాటాలను అణిచివేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దూదిగం బసవయ్య అధ్యక్షతన జరిగిన రాస్తారోకోలో వెంకటరమణ, సంధ్యారాణి, రమాదేవి, ధనలక్ష్మి, నాగమణి పాల్గొన్నారు. మధిర పట్టణంలోని భగత్‌సింగ్ సెంటర్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నరసింహారావు మాట్లాడుతూ ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా కార్యకర్తలపై లాఠీచార్జి, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అణచివేయడం సరికాదన్నారు.
పనిభారాన్ని తగ్గించి వేధింపులను అరికట్టాలని కోరారు. సృజన, బాపట్ల లక్ష్మి, రజిని, నాగమణి, లక్ష్మి పాల్గొన్నారు. బోనకల్లులో ఆశా కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి తమ సమస్యలను తక్షణమే పరిషరించాలని కోరారు. మరీదు లీలాకుమారి, గద్దె తులసి, గంగుల విజయలక్ష్మి, కొంగర వెంకటరమణ, కుకల నారాయణమ్మ, విజయ్‌కుమారి పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో ఆశా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్, పి.విజయలక్ష్మిలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రమ్య, మంగమ్మ, నాగమణి, జయ తదితరులు పాల్గొన్నారు.