రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఖమ్మం నగరం మయూరి సెంటర్లోని అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు నివాళి అర్పించారు. అనంతరం వీరు ఖమ్మం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం, జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యారు. ముందుగా అమర వీరులను స్మరించుకున్నారు.
రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మంత్రి వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఖమ్మం నగర మేయర్ పి.నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్లు ఉన్నారు. సత్తుపల్లి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళి అర్పించారు.
వైరా మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మణుగూరు పట్టణంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అమరవీరుల త్యాగాలను కొనియాడారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ అమరవీరులకు నివాళి అర్పించారు. అమరులకు నివాళి కార్యక్రమాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగిశాయి.
– ఖమ్మం, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)