ఖమ్మం, మార్చి 16: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరిచిందని ఖమ్మానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు మండిపడ్డారు. ఆయనకు అవమానం కలిగేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ నేత గీతారెడ్డి మాతృమూర్తి ఈశ్వరీబాయి పేరు పెట్టేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఆక్షేపణీయమైనవని అన్నారు. పొట్టి శ్రీరాములు పేరును తొలగించే ప్రయత్నాలను సీఎం రేవంత్రెడ్డి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఖమ్మంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా, నగర కమిటీ సమావేశంలో సంఘం నేతలు పసుమర్తి చందర్రావు, గుమ్మడవెల్లి శ్రీనివాసరావు, మేళ్లచెరువు వెంకటేశ్వర రావు, గోళ్ల రాధాకృష్ణ, చిన్ని కృష్ణారావు, దేవకి వాసుదేవరావు, సన్నే ఉదయప్రతాప్, కొప్పు నరేశ్, కొత్త వెంకటేశ్వరరావు, పాల్వాయి వెంకటేశ్వరరావు, కొణతం లక్ష్మీనారాయణ, పాల్వాయి సీతయ్య, విన్నమూరి సుబ్బారావు, మిట్టపల్లి రవి తదితరులు మాట్లాడారు.
హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమని అన్నారు. అది సరైన పద్ధతి కాదని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించిన గత ప్రభుత్వాలు.. వర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించేందుకే ఏనాడూ ప్రయత్నించలేదని గుర్తుచేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
ఈ ఆలోచన ఎంతో బాధాకరమని, ఇలాంటి ఆలోచనతో త్యాగమూర్తిని అవమానపరిచినట్టు అవుతోందని అన్నారు. అమరజీవి పేరు మార్చే ప్రయత్నం చేస్తే తెలుగు రాష్ర్టాల్లోని ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందని అన్నారు. అదే జరిగితే తమ ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆర్యవైశులందరమూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఖండిస్తున్నామని అన్నారు. పేరు మార్చే ప్రయత్నాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆపకపోతే మున్ముందు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురోవాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు.