పాల్వంచ/ మధిర, ఏప్రిల్ 12: విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో రోజుకు చేరింది. ఈ సమ్మెకు వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.
సమ్మె శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. అనంతరం ఆ నేతలు మాట్లాడుతూ.. తమ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు న్యాయమైనవని అన్నారు. ప్రభుత్వం తక్షణమే వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సమ్మె ఉధృతమై మరిన్ని రోజులు కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని, వేసవి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు. పాల్వంచ కేటీపీఎస్ ఆర్టిజన్లకు సీపీఎం నాయకులు, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 నేతలు సంఘీభావం తెలిపారు. మధిర ఆర్టిజన్ కార్మికుల సమ్మె శిబిరంలో విద్యుత్ శాఖలోని 327, 1104 వంటి ప్రధాన ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మిక జేఏసీ నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.