అశ్వారావుపేట, ఏప్రిల్ 10 : విద్యుత్ కార్మికుల పట్ల జెన్కో, ఎన్పీడీసీఎల్ సంస్థలు వివక్ష చూపుతున్నాయి. అపరిష్కృత సమస్యలను పట్టించుకో కపోవ డంతో కార్మికులకు ఆర్థిక నష్టం కలుగుతున్నది. దీంతో సమ్మె బాట పట్టిన ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు ఆందోళనను ఉధృతం చేశారు. విధులను బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొంటు న్నారు. అయితే సమ్మె ప్రభావం విద్యుత్ సరఫరాపై పడనుంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి పనులకు సిబ్బంది కొరత వెంటాడుతున్నది. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పేటట్లు లేవు. ఒకపక్క సమ్మెను విరమించాలని కార్మికులను జోన్కో బెదిరింపులకు పాల్పడుతున్నా ఖాతరు చేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. ఒకే సంస్థ అయినప్పటికీ రెండు నిబంధనలు అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీస ప్రయోజనాలు వర్తించడం లేదు. కన్వర్షన్ అమలు కావడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 330 మంది ఆర్టిజన్ ఉద్యోగులు, 105 మంది అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు ఉన్నారు. వీరంతా డివిజనల్ కార్యాలయాల ఎదుట సమ్మె చేస్తున్నారు.
విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికుల సమస్యల సాధన కోసం సామరస్యంగానే పోరాడుతున్నారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. సమస్యలను మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. అయినా ఫలితం లేకపోవడంతో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 330 మంది ఆర్టిజన్లు, 105 మంది అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు ఉన్నారు.
వీరిని నాలుగు గ్రేడ్లుగా విభజించిన సంస్థ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నది. ఫలితంగా కొన్ని ప్రయోజనాలు దూరమవుతుండగా తక్కువ పే స్కేళ్లను అమలు చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. పైగా ఒకే సంస్థలో పని చేస్తున్నప్పటికీ సెకండ్ క్యాడర్ కార్మికులుగా చూడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఒకే సర్వీస్ రూల్స్ ఉంటాయి. కానీ, విద్యుత్ సంస్థలో మాత్రం వేర్వేరు నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ వర్కర్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు.
ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో సబ్స్టేషన్లలో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ దశలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలులు వంటి సమస్యలు ఎదురైతే ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవు. సమ్మె ప్రభావం అటు సంస్థ, ఎటు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే విద్యుత్ సరఫరాలో సమస్యలు జఠిలం కానున్నాయి. కార్మికుల సమస్యలను సంస్థ పరిష్కరిస్తుందా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా? లేదా సమస్యలు ఎదురైతే వినియోగదారులను ఇబ్బందికి గురిచేస్తుందా? అనేది చూడాలి. సమ్మెను విరమించాలంటూ జెన్కో కార్మికులను ఆ సంస్థ బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇందుకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఖాతరు చేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. మరోవైపు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కూడా నిలిపివేసింది.