కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 26: సింగరేణి సంస్థలో బుధవారం జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరేణివ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు 11 ఏరియాల్లో 84 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రాత్రి 7.00కు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. కౌంటింగ్‌కు సంస్థ వ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీజియన్ వారీగా కొత్తగూడెం పరిధిలో కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లెందు, మణుగూరులలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఓటు వేసేందుకు కార్మికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు (పర్మినెంట్/టెంపపరీ) తీసుకెళ్లాలి. సంస్థవ్యాప్తంగా 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొత్తగూడెం కార్పొరేట్‌లోని న్యూ కాన్ఫరెన్స్ హాల్ హెడ్డాఫీస్ (హైదరాబాద్‌లో సింగరేణి భవన్లో కౌంటింగ్ వేరుగా ఉంటుంది), ఏరియా ఆర్సీవోఏ క్లబ్ రుద్రంపూర్, ఇల్లెందు ఏరియాలో 24 ఇైంక్లెన్ కమ్యూనిటీ హాల్లో, మణుగూరు ఏరియాలో పీవీ కాలనీ కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.