భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పూర్తి చేశారు. పీవో, ఏపీవో, ఓపీఓలతో సమావేశం నిర్వహించి పోలింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో 2,022 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా.. అందులో మహిళలు 954, పురుషులు 1,068 మంది ఉన్నారు.
ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఎన్నికల నియమావళి పాటించేలా చర్యలు చేపట్టారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు, ప్రచారం, రాజకీయపరమైన అంశాలతో కూ డిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపడంపై ఎన్నికల సంఘం నిషేధించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
27న జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు జిల్లాలోని 23 మండలాల్లో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవోలు 28 మంది, ఏపీవోలు 28, వోపీలు 28, ఓపీఓలు 28 మందిని నియమించారు. 26న జిల్లా కేంద్రంలోని రామచంద్రా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు. అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని, సిబ్బందిని వాహనాల ద్వారా తరలిస్తారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది.
ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి. ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం వరకు రాజకీయ ప్రచారాలు నిషేధించాం. బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పెట్టకూడదు. సమావేశాలు, సభలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాం. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.