Bhadradri Forest | మన్యం.. వన్యప్రాణులకు ఆలవాలం.. వాటి గమనం.. గమ్యం అంతా అడవిలోనే.. అయితే, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యంలో అటవీ జంతువుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు అమర్చారు. అక్కడక్కడా బేస్‌క్యాంప్‌లు నిర్మించారు. వన్యప్రాణులు దాహార్తికి అల్లాడి పోకూడదని అక్కడక్కడా నీటి తొట్లు, సాసర్ పిట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీవాల గణనను పక్కాగా చేపట్టి, వాటి సంతతిని పెంచుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నారు. అంతేకాదు, అరుదైన జీవజాతుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 27: భద్రాద్రి పూర్తి ఏజెన్సీ జిల్లా. ఇక్కడ అటవీ ప్రాంత విస్తీర్ణం ఎక్కువ. జిల్లాలోని భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్య ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర అటవీశాఖ సమగ్ర చర్యలు తీసుకుంటున్నది.. వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నది.. అవసరమైన చోట సీసీ కెమెరాలు అమర్చింది.. అక్కడక్కడా బేస్‌క్యాంప్‌లు నిర్మించింది.. జీవాల గణనను పక్కాగా చేపట్టి, వాటి సంతతి పెంచుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నది.. వేసవి దృష్ట్యా వాటి దాహార్తి తీర్చేందుకు అటవీప్రాంతంలో పలుచోట్ల నీటి తొట్లు అందుబాటులో ఉంచింది.. ముఖ్యంగా అరుదైన జీవ జాతుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.
జంతువుల ఆవాసాలు ఇవీ..
లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమళ్ల సెక్షన్, చాతకొండ రేంజ్, కిన్నెరసాని డివిజన్, గుండ్లమడుగు అటవీ ప్రాంతం వన్యప్రాణుల ఆవాసాలుగా మారా యి. ఆయా ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు దుప్పులు, జిం కలు, అడవి పం దులు, ఎలుగు బంట్లు, కొండగొర్రెలు, విష సర్పా లు, కోతులు, కొండముచ్చులతో పాటు అరుదైన పక్షులను గుర్తించారు. అంతరించిపోతున్నాయని భావిస్తున్న అడవి దున్నల కదలికలూ సీసీ కెమెరాలకు చిక్కాయని తెలుపుతున్నారు. ఇటీవల 15 అడవి దున్నలను ఫారెస్ట్‌లో గుర్తించామని వెల్లడించారు.నీటితొట్ల ఏర్పాటు..
వేసవి ప్రవేశించింది. ఉష్ణోగ్రతలు రోజు రోజూకు పెరుగుతున్నాయి.. అటవీప్రాంతంలో దాహార్తి తీర్చుకోలేక వణ్యప్రాణులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు ఫారెస్ట్‌లో అక్కడక్కడా నీటి తొట్లు, సాసర్ పిట్లు ఏర్పాటు చేస్తున్నది. సిబ్బంది రోజు రోజు విడిచి రోజు ట్యాంకర్ల సాయంతో వాటిలో నీరు నింపుతున్నారు. నీటిని నిల్వ చేసేందుకు వాటర్ రింగ్స్‌ను అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి అటవీ ప్రాంతాల్లోని వాగుల్లో పారుతున్న నీటినీ సేకరించి పర్చ్యులేషన్ ట్యాంక్‌లు నింపుతున్నారు. వాగుల పక్కన చెలిమల వంటి గుంటలు తవ్వుతున్నారు. వాటిలో నీరు ఊరిన తర్వాత అక్కడ జీవాలు వాటి దాహార్తి తీర్చుకుంటున్నాయి. అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం ఉండదు కనుక ఫారెస్ట్ అధికారులు అటవీప్రాంతంలో సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు.
Khammam5
పర్యవేక్షణకు బేస్ క్యాంప్‌లు..
వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ఫారెస్ట్‌లో కొన్నిచోట్ల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. క్యాంప్‌ల పరిధిలో ఐదుగురు చొప్పున ఒక బృందం ఏర్పాటు చేశారు. బృందాల్లో సభ్యులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు. వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. వీరు రేయింబవళ్లు అడవిలో గస్తీ కాస్తున్నారు. అడవిలో కార్చిచ్చు పుట్టకుండా, మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేటగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
నిరంతరం సీసీ కెమెరాల నిఘా..
వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులు రేగళ్ల, గట్టుమళ్ల, మైలారం, చింతల చెలక, కిన్నెరసాని, పడిగాపురం తదితర అటవీప్రాంతంలో సీసీ కెమెరాలతో పాటు కెమెరాట్రాప్స్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అడవిలో మనుషుల కదలికలను గమనిస్తున్నారు. జీవాల సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల్లో అమర్చిన మెమొరీ చిప్‌ను వారం రోజులకు ఒకసారి మారుస్తున్నారు. అటవీశాఖ కార్యాలయానికి చిప్ తీసుకొచ్చిన తర్వాత, దానిలోని ఫుటేజీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
వన్యప్రాణులను కాపాడుతున్నాం..
వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్లు, వాగుల్లో చెలిమలు ఏర్పాటు చేశాం. నీటి వసతి కోసం సోలార్ బోర్లు ఏర్పాటు చేశాం. ట్యాంకర్ల ద్వారా నీటి తొట్లలో నీటిని నింపుతున్నాం. దాహం తీర్చుకోవడానికి జీవాలు గ్రామాలకు రాకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం.
– దామోదర్‌రెడ్డి, ఎఫ్‌డీవో
Khammam6