మామిళ్లగూడెం, మే 11 : కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశామని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి మీడియా, రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 97.50 శాతం ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామన్నారు. ఇంకా 40,819 మందికి స్లిప్‌లు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఆయా ఓటర్లు బీఎల్వోలు వెళ్లిన సమయంలో లేకపోవడంతో వారికి అందించలేదన్నారు. ఇలాంటి ఓటర్ల స్లిప్‌లను సీల్ చేశామని, ఓటరు జాబితాలో పేరు ఉండి స్లిప్ అందని వారు కూడా ఓటుహక్కును వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డుతో పోలింగ్‌కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
మే 13వ తేదీన ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు 8,199 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో నలుగురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. మిగతా 31 మంది వివిధ రిజిస్టర్ పార్టీల అభ్యర్థులతోపాటు ఏ పార్టీలతో సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాలు, 1,084 లోకేషన్లు ఉన్నాయని వీటిలో విధులు నిర్వహించేందుకు 7,584 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఓపీఓలను నియమించామన్నారు.
పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన బ్యాలెట్ యూనిట్లు-7,034, కంట్రోల్ యూనిట్లు-2,323, వీవీప్యాట్స్-2,634 ఆయా నియోజకవర్గాల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలకు తరలించామని తెలిపారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న పీవో, ఏపీవో, ఓపీవోలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 7గంటల వరకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 16,31039 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,87,160 మంది పురుషులు, 8,43,749 మంది మహిళలు, 130 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు 50,747 మంది ఉన్నారన్నారు. ఓటరు స్లిప్పులు కేవలం ఓటర్లకు సమాచారం మాత్రమేనని, పోలింగ్ కేంద్రానికి వచేప్పుడు ఎన్నికల సంఘం సూచించిన ఏదేని గుర్తింపుకార్డు తీసుకపోవాల్సి ఉంటుందని తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే సోమవారం సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు, బార్ ఎండ్ రెస్టారెంట్లు 48 గంటలపాటు మూసివేయాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ విధులకు 4,291 మంది రాష్ట్ర, కేంద్ర బలగాల పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన 86 పోలింగ్ కేంద్రాలలో కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.