బోనకల్లు, మే 05 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని బోనకల్లు మండలం గార్లపాడు రెవెన్యూ గ్రామాన్ని భూ సమస్యల పరిష్కారానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేందుకు, జవాబుదారితనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం కానున్నట్లు వెల్లడించారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు భూ భారతి లో అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేయవచ్చన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టంలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని తెలిపారు. భూదార్ కార్డుల జారీ జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి, ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం చట్టంలో ఉందన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డులో లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. గార్లపాడులో చేపట్టిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు స్వీకరించి, రశీదులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, బోనకల్లు మండల తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఆర్ఐ మైథిలి, అధికారులు పాల్గొన్నారు.