– ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 08 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు కో ఆప్షన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. వారిలో ఇద్దరు మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం(విద్యావంతులు ), మరో ఇద్దరు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారై ఉండాలన్నారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ఒక మహిళా సభ్యులు ఖచ్చితంగా ఉండాల్సి ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు అయి ఉండాలని, 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు.
ప్రత్యేక పరిజ్ఞానం కేటగిరికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్, పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుడు లేదా అడ్వకేట్ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంఘాల్లో ఉద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసిన వారు అర్హులన్నారు. అల్ప సంఖ్యాక వర్గాలకు సంబంధించి ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధం, పార్సీ మతాలకు చెందిన వారై ఉండాలన్నారు. వీరు సైతం మున్సిపాలిటీ పరిధిలో ఓటరై ఉండి 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి దరఖాస్తు ఫారం తో పాటు అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జతపరిచి కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.