కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 9: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు – భద్రతాదళాలకు మధ్య జరిగిన భీకరపోరులో పచ్చని ప్రకృతి వనం రక్తపుటేరులై పారింది. యుద్ధభూమిని తలపించిన ఇరువర్గాల పోరు.. పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమవగా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఫర్సేఘఢ్ ఇలాకాలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వు గార్డు (డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో సుమారు వెయ్యి మంది భద్రతా దళాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు ఉన్న లోకేషన్‌ను జవాన్లు నలుదిక్కులా చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉదయం నేషనల్ పార్క్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. కాసేపటికి తేరుకున్న జవాన్లు అప్రమత్తమైన మావోయిస్టులపై ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు మూడు – నాలుగు సార్లు విడతల వారీగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
మావోయిస్టులను చుట్టముట్టి వస్తున్న భద్రతాదళాల తాకిడి పెరగడంతో వారి ధాటికి తాళలేక కాల్పులు జరుపుకుంటూనే అక్కడి నుంచి పారిపోయారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడతో ఇందులో ఒక ఎస్టీఎఫ్ జవాన్, ఒక డీఆర్జీ జవాన్ మృతిచెందారు. మిగతా ఇద్దరు జవాన్లను ఎయిర్‌లిఫ్టర్ సహాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 31 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఏకే-47, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్లతోపాటు భారీఎత్తున ఇతర ఆయుధ వస్తు, సామగ్రిని ఘటనా స్థలం నుంచి భద్రతాదళాలు స్వాధీనపరుచుకున్నాయి. మృతిచెందిన మావోయిస్టుల్లో తెలంగాణ క్యాడర్‌కి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ మీడియాతో మాట్లాడుతూ.. బీజాపూర్ జిల్లా అడవుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మావోయిస్టులు సమావేశమవుతున్నట్లుగా వచ్చిన పక్కా సమాచారం మేరకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారని ఆయన తెలిపారు. అదే విధంగా డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకు చెందిన ఇద్దరు జవాన్లు సైతం మృతి చెందినట్లు స్పష్టం చేశారు.
2025లో మొదలు నుంచి ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 65 మంది మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసినట్లు ఐజీ సుందర్రాజ్ పాటిలింగం వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనతో బస్తర్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేసి, గాలింపులను ముమ్మరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. మృతుల పూర్తి వివరాలను గుర్తించాక వెల్లడించనున్నట్లు తెలిపారు. సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మందమర్రి ప్రాంతానికి చెందిన బండి ప్రకాశ్ (65) అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు సమాచారం. అదేవిధంగా మృతుల్లో ఆదిలాబాద్ ఏరియా కార్యదర్శి ఆదేలు భాస్కర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.