ఖమ్మం రూరల్ : గాంజా, మద్యం బాబుల నుంచి తమ అంగన్వాడీ కేంద్రానికి విముక్తి కలిగించాలని ఓ అంగన్వాడీ టీచర్ నిండు గ్రామసభలో తన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలలో భాగంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో సంబంధిత అధికారులు గ్రామ సభలను నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని చైర్ పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 23వ వార్డులో జరిగిన గ్రామసభకు మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామసభకు హాజరైన 23వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీ చెందిన అంగన్వాడీ టీచర్ సరిత తమ సమస్యలను అధికారుల ముందు ఉంచారు.
అంగన్వాడీ కేంద్రం ప్రధాన రహదారి పక్కనే ఉందని గత కొద్ది సంవత్సరాలుగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం అనేకమందికి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి కొందరు యువకులు అంగన్వాడీ కేంద్రం ప్రాంగణాన్ని అడ్డాగా చేసుకుని రాత్రివేళ మద్యం సేవిస్తూ గాంజా సేవిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనేకమార్లు గోడకు ఇలాంటి పనులు చేయవద్దని పేపర్ పై రాసిపెట్టిన చింపి వేస్తున్నారని తెలిపారు. బ్లేడ్లతోని చేతులు కట్ చేసుకున్న రక్తపు మరకలు కూడా ఉన్నాయని, మద్యం సీసాలు కూడా కనపడుతున్నాయని వీరి భార్య నుంచి అంగన్వాడీ కేంద్రానికి విముక్తి కల్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన కమిషనర్ ఈ విషయాన్ని అక్కడికక్కడే రూరల్ సీఐ పుష్కరాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇకనుంచైనా ఈ ఘటనకు తెరపడుతుందా లేదా చూడాలి.