భద్రాచలం, డిసెంబర్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిపై పలు విమర్శలు వస్తున్నాయి. గత పదేళ్లుగా లడ్డూ తయారీకి కరీంనగర్ డెయిరీ పేరుతో సరఫరా చేసే నెయ్యిని వినియోగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో జరిగిన టెండర్లలో కరీంనగర్ డెయిరీకి కాకుండా.. ఆంధ్రా ప్రాంతంలోని జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ డెయిరీ ఫాం నెయ్యిని లడ్డూ తయారీకి వాడుతున్నారు.
ఇటీవల దేవస్థానంలో జరిగిన నెయ్యి టెండర్ల ప్రక్రియలో కరీంనగర్ డెయిరీ జీఎస్టీతో కలిపి కిలోకు రూ.610కి వేయగా.. జంగారెడ్డిగూడెంలోని రైతు డెయిరీ జీఎస్టీతో కలిపి కిలోకు రూ.534.24కు టెండర్ వేసి దక్కించుకుంది. ప్రధాన ఆలయాలకు రెండేళ్లపాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ.10 కోట్ల టెండర్లు వేసి ఉండాలన్న నిబంధనలో రైతు డెయిరీ అర్హత సాధించకపోయినా.. ఈ టెండర్‌ను ఆలయ అధికారులు రైతు డెయిరీకి కట్టబెట్టడంపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
అటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. టీటీడీ లడ్డూ తయారీలో వివాదం జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆలయాల్లో కూడా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి విషయంలో నాణ్యత కోసం ప్రభుత్వ డెయిరీల నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వాటిని ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నెయ్యి టెండర్ల విషయంలో మరోసారి పరిశీలించి తెలంగాణ ప్రాంతంలోని డెయిరీల నుంచి నెయ్యి సరఫరా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.