ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 13: నాటకం అజరామరమని, నాటక రంగానికి పూర్వ వైభవం రావాలని, ప్రాచీన కళను పునరుజ్జీవం చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. విజయభారతి నాట్య మండలి సురభి సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం సురభి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగబత్తిని రవి, నాటక రంగ పరిశోధకుడు నిభానపూడి సుబ్బరాజు, నాటక సమాజాల అధ్యక్షుడు తడకమళ్ల రామచందర్‌రావు, రచయిత అట్లూరి వెంకటరమణ సురభి నాటక రంగ సేవలను కొనియాడారు.
ప్రేక్షకుడికి, కళాకారుడికి ప్రత్యక్ష అనుబంధంతో నవరసాలతో రసరమ్యంగా సజీ వం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నాటక ప్రదర్శనల నిర్వహణకు సురభి కార్యదర్శి ఉపేందర్‌కు నాగబత్తిని రవి రూ.10వేలు అందజేశారు. సమావేశంలో సురభి రమేశ్, ఉత్సవాల నిర్వాహకుడు ఉపేందర్, కేఎస్ఎన్ మూర్తి, ప్రముఖ వ్యాఖ్యాత రవీందర్ పాల్గొన్నారు. మోదుగు గోవింద్ ఆలపించిన గీతాలు అలరించాయి. అనంతరం కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ప్రేక్షకులను మాయాలోకంలోకి తీసుకెళ్లింది. రంగస్థలంపై యుద్ధ ఘట్టాలు, అభిమన్యు శశిరేఖ ప్రణ య సన్నివేశాలు, లక్ష్మణకుమారుడి విచిత్ర వేషాలు ఆకట్టుకున్నాయి. కృష్ణుడిగా దినకర్, శశిరేఖగా హేమాంన్స, అభిమన్యుడిగా సుభకర్, నారధుడిగా మానస, హిడింబి నిరంజన్‌రావు ఆయా పాత్రల్లో జీవించారు.