రఘునాథపాలెం, మే 27: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కోండ్రు రాములమ్మ. భర్త చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పింఛన్ ఇస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జూన్ 2 నుంచి కొత్త పింఛన్లను ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో తనకూ తప్పకుండా పింఛన్ వస్తుందని ఆశగా చూస్తోంది. సంతోషం పట్టలేక గ్రామంలో ఉండే అధికార పార్టీ నాయకుడిని కలిసి ‘నాకు పింఛన్ వస్తుందిగా అయ్యా..’ అంటూ అడిగింది.
దీంతో సదరు నాయకుడు వృద్ధురాలి ఆధార్ కార్డును తీసుకొని మండల పరిషత్ కార్యాలయంలో పింఛన్ దరఖాస్తు గురించి ఆరా తీశాడు. తీరా పింఛన్ వెబ్సైట్లో స్టేటస్ చూసి ఆ నాయకుడు అవాక్కయ్యాడు. మంజూరు జాబితాలో రాములమ్మ పేరు లేదు. పైగా, స్టేటస్ ‘డెత్’గా నమోదై ఉంది. ‘బతికుండగానే చంపేశారు ఏంటి సారూ..’ అంటూ కార్యాలయం ఉద్యోగిపై ఆ నాయకుడు కోపోద్రిక్తుయ్యాడు. ‘కనీసం ఆ సైట్ నుంచి ఆ వృద్ధురాలి పేరు తొలగించండి. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేస్తాం’ అంటూ కోరాడు. సైట్లో డిలీషన్కి అవకాశమే లేదంటూ ఆ ఉద్యోగి చెప్పడంతో నాయకుడు కంగుతిన్నాడు.
ఇదీ.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో అధికారుల వ్యవహార శైలి. రఘునాథపాలెం మండలంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు సంబంధించిన పేదలు వేలాదిగా దరఖాస్తు చేసుకుంటే అసలు అధికారులు ఆన్లైన్లోనే నమోదు చేయలేదంటే నిర్లక్ష్యం ఎంత మేరకు ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రం రఘునాథపాలేనికి చెందిన వృద్ధురాలు కోండ్రు రాములమ్మను బతికుండగానే చంపేసినట్లు.. అసలు పింఛన్ కోసం ఆర్జీ పెట్టుకున్న అనేక దరఖాస్తుల్లో అనేకం కానరాకుండా చేశారు.
ఆన్లైన్ చేయకుండానే అనేక అప్లికేషన్లను మూలకు పడేసినట్లు తెలియవస్తోంది. కానీ, దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి పింఛన్ కోసం దరఖాస్తుదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. తాజాగా రేవంత్ సర్కార్ జూన్ 2 నుంచి కొత్త ఫింఛన్లను ప్రారంభిస్తామని ప్రకటించడంతో నిత్యం అనేకమంది దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ పింఛన్ విషయమై ఆరా తీస్తున్నారు. అనేకమంది దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ అసలు ఆన్లైన్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతుండడం కనిపిస్తోంది.