భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/మామిళ్లగూడెం/కొత్తగూడెం సింగరేణి, ఏప్రిల్ 12: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను విజయవంతం చేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని జడ్పీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 8:00 గంటలకు అంబేద్కర్‌కు కలెక్టర్, జిల్లా అధికారులు నివాళి అర్పించనున్నారు. అనంతరం శ్రీభక్త రామదాసు కళాక్షేత్రంలో అంబేద్కర్ జీవితం, రచనలపై అధికారులు కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు హాజరుకానున్నారు. ఇదే విధంగా కొత్తగూడెం జిల్లాకేంద్రంలోనూ సంబురాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వేడుకలకు విధిగా హాజరు కావాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
హైదరాబాద్‌లో శుక్రవారం జరుగనున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ వేడుక ఉమ్మడి జిల్లా నుంచి వందలాది మంది తరలివెళ్లారు. అధికారులు ప్రజల కోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చారు. ప్రతి బస్‌కు ఒక లైజన్ అఫీసర్‌ను నియమించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లే వారికి నార్కెట్ పల్లిలో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాట్ల బాధ్యతలను తహసీల్దార్లతో పాటు ఓ జిల్లా అధికారి చూసుకోనున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్, 11 ఏరియాలతో పాటు ఎస్టీటీపీపీలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సంస్థ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. అంబేద్కర్ జయంతి వేడుకలకు గతంలో ఏరియాకు రూ.60 వేలు విడుదల చేసిన యాజమాన్యం సంస్థ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుల అభ్యర్థన మేరకు ఈసారి రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే వేడుకలకు అన్ని ఏరియాల్లో వేదికలు సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లో సంబురాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో జరిగే వేడుకకు డైరెక్టర్ (పా, ఫైనాన్స్) ఎన్.బలరాం, గౌరవ అతిథులుగా డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్‌రెడ్డి హాజరవుతారు. ఏరియాల పరిధిలో ఆయా ఏరియాల జీఎంల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయి.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేదర్. సమాజంలో అసమానతలను రూపుమాపడానికి జీవితాన్నే పణంగా పెట్టి దేశానికి రాజ్యాంగాన్నిచ్చిన మహనీయుడు. గొప్ప మానవతావాది. ఆయన్ను స్మరించుకోవడం మన బాధ్యత. అట్టడుగు వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన మహోన్నత ఉద్యమ కెరటం. దళిత ఉద్యమాల్లో అంబేదర్ పాత్ర అనిర్వచనీయం. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి. ఆయన తాత్విక చింతనను నేటి యువత అలవరచుకోవాలి. ఆచరణతో కూడిన విలువలను పాటించాలి. ప్రతి అంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించాలి. అంబేదర్ గొప్ప సామాజిక విప్లవకారుడు. ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అంబేదర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారు. సమ సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ నిరంతరం పరితపించారు. వివక్ష లేని సమాజం కోసం నిరంతరం పోరాడారు. బడుగుల జీవితాలను వెలుగ బాట పట్టించారు. అంబేదర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పునరంకితమై పని చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నేడు జరుగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక ప్రజలందరికీ పండుగ. ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది.