దుమ్ముగూడెం, ఫిబ్రవరి 17 : రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక లారీలు తిరుగుతుండడంతో నిత్యం ప్రమాదాలు జరగడంతోపాటు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, వెంటనే లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, యువత ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం ములకపాడు ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. దాదాపు ఐదు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో భద్రాచలం-చర్ల మధ్య వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇసుక లారీల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ప్రధాన రహదారులన్నీ ధ్వంసమవుతున్నాయని తెలిపారు. అయితే ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్‌కుమార్, సీఐ వెంకటప్పయ్య అక్కడికి చేరుకొని అఖిలపక్షం నాయకులతో చర్చించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రిపూట లారీలను నిలిపివేసి పది రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మళ్లీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా.. స్థానిక ఎమ్మెల్యే సొంత మండలమైనప్పటికీ రహదారి నిర్మాణానికి కృషి చేయడం లేదని పలువురు ఆరోపించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, యువతతోపాటు బీఆర్ఎస్ నాయకులు కణితి రాముడు, ఎండీ.జానీపాషా, కామేశ్వరరావు, లంక శివ, సీపీఎం నాయకులు యలమంచలి వంశీ, సీపీఐ నాయకులు బొల్లోజు వేణు, టీడీపీ నాయకులు కొమరం దామోదర్‌రావు, మల్లుదొర, రేసు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.