మధిర, ఏప్రిల్ 12 : మధిరలో రైల్వే పాత గేటు సమీపంలో గోడ నిర్మాణ పనులను నిలిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల గతంలో ఉన్న రైల్వే గేటును మూసివేసినట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ సుమారు రెండు వైపులా కిలోమీటర్లు దూరం వెళ్లి రాకపోకలు సాగించాల్సి వస్తుందన్నారు. కాగా వృద్ధులు, చిన్నారులు, ప్రయాణికులు పాత గేటు సమీపం నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారిని మూసివేస్తే వారంతా ఇబ్బందులు పడడంతో పాటు వ్యాపారుల జీవనం దెబ్బతింటుందన్నారు.
ఇటీవల రైల్వే అధికారులు రాకపోకలు సాగించకుండా మూడో లైన్ నిర్మాణంతో పాటు పాత గేటు సమీపంలో ప్రహరీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పాత గేటు సమీపంలో అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అనేకసార్లు విన్నవించినా సమస్యపై దృష్టి సాధించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అండర్ బ్రిడ్జి నిర్మాణం మంజూరయ్యే వరకు పాత గేటు సమీపంలో గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తరు నాగేశ్వర్రావు, బెజవాడ రవి, మల్లాది హనుమంతరావు, సూరంశెట్టి కిశోర్, మడుపల్లి గోపాలరావు, అరెగ శ్రీనివాస్‌రావు, యన్నంశెట్టి అప్పారావు, పాపినేని రామనర్సయ్య, సేలం నరసింహారావు, మిరియాల రమణ గుప్తా, మందా సైదులు పాల్గొన్నారు.