సారపాక, జూన్ 21: సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాకే దేవాలయాలు ఆధునీకరణకు నోచుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలకూ సమాన ప్రాధాన్యమిచ్చి నిధులు విడుదల చేయడంతోనే ఇప్పుడు ఆయా దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మణుగూరులో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు హోమం నిర్వహించగా ప్రభుత్వ విప్ రేగా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణలో ఆయా మతాల ప్రజలు జరుపుకునే ప్రతి పండుగకూ సాయం అందించడంలో బీఆర్ఎస్ సర్కారు ముందువరుసలో ఉందని అన్నారు. దసరాకు బతుకమ్మ చీరలు, రంజాన్‌కు రంజాన్ తోఫా, క్రిస్మస్కు క్రిస్మస్ కానుకలను అందిస్తున్నది దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. అనంతరం ప్రభుత్వ రేగాను ఆలయ కమిటీ బాధ్యులు, అర్చకులు శాలువాతో సత్కరించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు, జావేద్‌పాషా, వూకంటి ప్రభాకర్‌రావు, గుడిపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.