సత్తుపల్లి, ఏప్రిల్ 4 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం ఆయన పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి కల్లూరు మండలంలోని హనుమాతండా ప్రాథమికోన్నత పాఠశాల, కవాలిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముగ్గువెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్ తదితర అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల పాఠశాలలకు కాంపౌండ్ వాల్ లేదా పెన్షింగ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణ ఐపీఎస్ పి.మౌనిక, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఏప్రిల్ 4 : చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కల్లూరు మండలంలోని పేరువంచ వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ 24 గంటలూ పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. అదనపు డీసీపీ ప్రసాదరావు, కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, తహశీల్దార్ సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సై షాకీర్ ఉన్నారు.