ఖమ్మం సిటీ, ఆగస్టు 11: కడుపులో నులి పురుగులు ఉన్నట్లయితే ఎదిగే పిల్లలు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాటి నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు ఆహారం నుంచి లభించే శక్తిని నులి పురుగులు గ్రహిస్తాయని, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు.
తద్వారా పిల్లలు బలహీనంగా, నిస్సత్తువగా, అలసటగా ఉంటారని, తరచూ వ్యాధుల బారినపడి చదువుపై దృష్టి సారించలేకపోతారని వివరించారు. ఆల్బెండజోల్ టాబ్లెట్ (400 మిల్లీ గ్రాములు)ను ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారందరూ తప్పకుండా ఏడాదికి రెండు దఫాలు మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలని, పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు ఈనెల 18న వేయించాలని ఆదేశించారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతీబాయి మాట్లాడుతూ విద్యార్థులు కాళ్లకు చెప్పులు లేకుండా మట్టిలో తిరగవద్దని, చేతులు కడుక్కున్న తర్వాతే భోజనం చేయాలని సూచించారు. అనంతరం పిల్లలకు ఆల్బెండజోన్ మాత్రలు వేయించారు. వివిధ శాఖల అధికారులు డాక్టర్ చందూనాయక్, శైలజాలక్ష్మి, వీ.రాజశేఖర్, ఎం.రాజేంద్రప్రసాద్, డాక్టర్ కృష్ణచైతన్య, సుబ్రహ్మణ్యం, సాంబశివారెడ్డి, అన్వర్, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.