చింతకాని, మే 26: ‘మా కోసం, మా కుటుంబాల పోషణ కోసం ఎన్నో ఏళ్లుగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అసలు మీరు రైతులమే కాదంటూ చింతకాని ఎస్సై బాధ్యతారహితంగా ప్రకటనలు చేయడం తీవ్రంగా బాధించింది. మేం రైతులం కాదని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎస్సై ఎవరు’ అంటూ మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్తోపాటు బాధితులు మండిపడ్డారు. చింతకాని మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మొకజొన్న బస్తాలను కాంటా వేసి కొనుగోలు కేంద్రాల్లో పెట్టి దాదాపు 55 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లారీలను సీరియల్ ప్రకారం పంపించాలని సొసైటీ సీఈవోను పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. సొసైటీ అధికారులు కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ట్రక్ షీట్లు ఇస్తున్నారని, దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన వందలాది మంది రైతులు శాంతియుతంగా, న్యాయబద్ధంగా సొసైటీ గేటు వద్ద ఆందోళన చేశారని గుర్తు చేశారు. రైతుల బాధను అర్థం చేసుకోకుండా.. తాళం వేసిన ఘటనను సాకుగా చూపుతూ అక్రమ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు.
దాదాపు 15 ఎకరాలకు పైగా మొకజొన్న పంట సాగు చేశామని, ఆ పంటను అమ్ముకోవడానికి ఇదే సొసైటీ కార్యాలయం మాకు ట్రక్ షీట్లు కూడా జారీ చేసిందని, అలాంటిది.. ఇప్పుడు మేం రైతులం కాదని ఎస్సై వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందన్నారు. మా గ్రామానికి వచ్చి ఎవరిని అడిగినా మేము రైతులమనే చెబుతారని, వ్యవసాయం తప్ప మాకు మరో వృత్తి లేదని స్పష్టం చేశారు. ప్రతీ రైతుకు ఏదో ఒక రాజకీయ పార్టీతో అనుబంధం ఉండటం సహజమని, కానీ, దానిని కారణంగా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు చింతకాని ఎస్సై నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా మారి, రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే అయిన మల్లు భట్టి విక్రమార తన సొంత నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇంతటి ఇబ్బందులు, బాధలపై తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. సమావేశంలో బాధిత రైతులు జరగబోయిన కృష్ణ, ఆకుల చంద్రయ్యలతోపాటు బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు, గురజాల హన్మంతరావు, బొడ్డు వెంకటరామారావు, షేక్ షబ్బీర్, పిన్నెల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.