ఖమ్మం కల్చరల్ డిసెంబర్ 10: సాహితీ పునరుజ్జీవంగా, సాహితీలోకానికి నూతనోత్తేజంగా ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాలు నూతన ఒరవడి సృష్టించాలని పలువురు కవులు, రచయితలు ఆకాంక్షించారు. నగరంలోని లేక్‌వ్యూ క్లబ్లో శనివారం నిర్వహించిన ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభలో ప్రముఖ కవులు, రచయితలు ప్రసంగించారు. ఖమ్మం ఈస్తటిక్స్ నిర్వాహకులు గత నెలలో కవితలు, కథల విభాగాల్లో పోటీలు నిర్వహించగా దేశ నలుమూలల నుంచి తెలుగు భాషా ప్రవీణులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో విజేతలైన కవులు, రచయితలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఉత్తమ కవితా సంపుటి ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ కవి పసునూరి శ్రీధర్‌బాబుకు రూ.40 వేల ప్రథమ బహుమతిని, సాహితీ పురస్కారాన్ని అందజేశారు.
ప్రోత్సాహక బహుమతులుగా రచయితలు రేఖాజ్యోతి, కోడె భారతిలకు, కథా పురస్కారాల విభాగంలో సయ్యద్ సలీం, దేశరాజు, మారుతి పౌరోహితంలకు, మరో తొమ్మిది కథకులకు బహుమతులు అందజేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఈస్తటిక్స్ బాధ్యుడు పీ.రవిమారుత్ మాట్లాడుతూ.. తెలుగు సాహితీ సంపదను పెంచడానికి ఈ పురస్కారాల పోటీలు ఉపయుక్తమవుతాయన్నారు. ఏటా ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తామని, సాహితీ చరిత్రలో ఖమ్మం కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేస్తామని అన్నారు. ప్రముఖ కవులు ఖాదర్ మొహినుద్దీన్, కుప్పిలి పద్మ, అనిల్డాని, వెంకటకృష్ణ, లంకా శివరామప్రసాద్, ఖదీర్‌బాబు మాట్లాడుతూ.. సమాజానికి సాహితీ ప్రస్తాన బాధ్యతలను చాటారు.
ఖమ్మం ఈస్టటిక్స్ పురస్కారాలు రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రామాణిక పురస్కారాలుగా, ప్రతిష్టాత్మక అవార్డులుగా రాణించాలని అభిలషించారు. తొలిసారిగా ఖమ్మం నుంచి అధిక పారితోషికంతో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేస్తున్న ఈస్తటిక్స్ నిర్వాహకుడు రవిమారుత్ను అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తమ కవితా సంపుటి, కథలతో కూడిన ఈస్తటిక్స్ సంకలన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో ఈస్తటిక్స్ బాధ్యులు కవులు ప్రసేన్, కాళోజీ పురస్కార గ్రహీత సీతారామ్, వంశీకృష్ణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, మువ్వా శ్రీనివాసరావు, తెలుగు రాష్ర్టాల కవులు మధురాంతకం నరేంద్ర, గుంటూరు లక్ష్మీనర్సయ్య, పెద్దింటి అశోక్, రమణమూర్తి, డాక్టర్ నీరజ, సీత, చంద్రశేఖర్ ఆజాద్, రత్నాకర్, దుర్గాప్రసాద్, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన వందలాది మంది కవులు రచయితలతో ప్రాంగణం సాహితీసంపదతో తొణికిసలాడింది.