అశ్వారావుపేట, జూన్ 21 : దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్‌పాం సాగు వైపు ఆదివాసీ రైతులను ప్రోత్సహించనున్నట్లు నేషనల్ బయో డైవర్సిటీ చైర్మన్ అచ్లేందర్రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారులు కృష్ణమూర్తి, జయరాజ్‌లు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఆయిల్‌పాం సాగు పద్ధతులు, ప్రభుత్వ రాయితీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినట్లు చెప్పారు. సాంకేతిక బృందంతో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పర్యటించిన వారు.. ఆయిల్‌పాం తోటలను సందర్శించి రైతులతో మాట్లాడారు. సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
దమ్మపేట మండలం అల్లిపల్లి, మల్లారం, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామాల్లో ఆయిల్‌పాం, అంతర పంట సాగును పరిశీలించారు. ఆయిల్‌పాం సాగు, యాజమాన్య పద్ధతులు, దిగుబడులు, రవాణా, ధర నిర్ణయం, రైతులకు చెల్లింపు, నర్సరీలో మొక్కల పెంపు తదితర వివరాల గురించి ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు, తోటల నిర్వహణ, అంతర పంటలకు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తున్న సబ్సిడీ పథకాల గురించి డీహెచ్‌ఎస్‌వో సూర్యనారాయణ వివరించారు.
అక్కడ నుంచి అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేరుకుని ఆయిల్‌పాం గెలల క్రష్షింగ్, ఆయిల్ రికవరీ, ఉప ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ అంశాలను ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ వివరించారు. అల్లిపల్లిలో ఆయిల్‌ఫెడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌తో సమావేశమై సాగు వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగు వల్ల పర్యావరణానికి కలిగే లాభనష్టాలను కూడా అంచనా వేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఐఐవోపీఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎంవీ ప్రసాద్, దమ్మపేట ఉద్యాన అధికారి సందీప్, ఆయిల్‌ఫెడ్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.