కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 9: బాధితులు సమర్పించిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
చండ్రుగొండ మండలం రావికంపాడులో పాఠశాల అదనపు గదుల నిర్మాణ బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్ భూపతి శ్రీనివాసరావు, సుజాతనగర్ మండలం వేపలగడ్డకు చెందిన బానోత్ విజయకుమారి, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచకు చెందిన లీలావతి, ఇల్లెందు మండలం గుండాల గ్రామానికి చెందిన కొమరయ్య తమ తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.