తిరుమలాయపాలెం, జూన్ 4: పలువురు వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని బుధవారం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. వైద్య సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించగా పలువురు గైర్హాజరు అయినట్లు బయటపడింది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీహెచ్సీలో అవసరమైన పరికరాలు, మందులు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని సూచించారు. సీహెచ్సీలో పరిశుభ్రత పాటించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో షేక్ శిలార్ సాహెబ్, ఎంపీవో సూర్యనారాయణ, ఏవో సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.