ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 28 : పత్తిపంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వానకాలం పత్తి సీజన్ కొనుగోలు యాక్షన్‌ప్లాన్‌ను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానకాలం సీజన్లో 1,99,730 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందన్నారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో ఐదు సీసీఐ కేంద్రాలతోపాటు, మరో పది జిన్నింగ్ మిల్లుల వద్ద కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పొడవు పింజ రకానికి క్వింటాల్ రూ.7,251 మద్దతు ధర ప్రకటించామని, వచ్చేనెల 2వారం నుంచి పత్తిపంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు. మౌలిక వసతుల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తేమశాతం 8-12శాతం ఉండే విధంగా చూసుకొని కేంద్రాలకు తీసుకరావాలన్నారు. సమావేశంలో డీఎంవో ఎంఏ అలీం, డీఏవో పుల్లయ్య, లీగల్ మెట్రాలజీ అధికారి విజయ్‌బాబు, ఫైర్ ఆఫీసర్ బీ అజయ్‌కుమార్, విద్యుత్‌శాఖ అధికారి సతీష్, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, మోహిసున్ సుల్తానా పాల్గొన్నారు.