ఖమ్మం రూరల్, జూన్ 1 : రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సత్యనారాయణపురం గ్రామస్తులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామంలో ప్రధాన సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి మీరు పడిన కష్టం ఎప్పటికి గుర్తు ఉంటుందన్నారు. మీ కష్టంతోనే పేదలకు మరింత సేవ చేసే పోర్టు పోలియోలు వచ్చాయన్నారు. ఏడాదిలోపు ప్రతి వాడలో సీసీరోడ్ల నిర్మాణంతోపాటు సైడ్ కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో మాత్రం మూడేళ్లలోపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, కళ్లెం వెంకటరెడ్డి, రాజశేఖర్రెడ్డి, కేవీ చారి, మద్ది మల్లారెడ్డి, సీపీఐ నాయకుడు దండి సురేశ్, వెంపటి రవి తదితరులు పాల్గొన్నారు.