వైరాటౌన్/ రఘునాథపాలెం, మార్చి 24 : పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ్యక్తిగత సహాయకుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ వెల్లడించారు. వైరా ఎంవీఐ ఏ.వరప్రసాద్, ఆయన వ్యక్తిగత సహాయకుడు రాజశేఖర్.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ఐదు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లు ఉన్న యజమానిపై కేసు నమోదు చేశారు.
అనంతరం నెలవారీ లంచం డిమాండ్ చేయగా.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2,200, టిప్పర్‌కు రూ.3,200 చొప్పున.. మొత్తం రూ.24,800లు వారు తీసుకుంటుండగా వీడియో రికార్డు చేసిన సదరు బాధితులు ఏసీబీ అధికారులకు అందజేశారు. వాటి ఆధారంగా ఎంవీఐ కార్యాలయంలో మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించగా, రూ.50,200లు అనధికార నగదును గుర్తించారు. దీంతోపాటు పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎంవీఐ వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని వరంగల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ రమేశ్ వివరించారు. కాగా, ఎంవీఐ వ్యక్తిగత సహాయకుడు రాజశేఖర్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఖమ్మంలోని ఎంవీఐ ఇంటిపై కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.