కొత్తగూడెం సింగరేణి, మే 6: కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్‌షాప్‌లో మోటర్ వెహికిల్ (ఎంవీ) డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అన్నబోయిన రాజేశ్వరరావును ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం అరెస్టు చేశారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. అన్నబోయిన రాజేశ్వరరావు మూడు నాలుగేళ్లుగా పలు అక్రమాలకు తెరలేపారు.
సింగరేణి కార్మికుల్లో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారిని, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రిక్వెస్టులు, ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని, నోటిఫికేషన్ల ద్వారా సింగరేణి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వారిని సంప్రదించేవాడు. తన మొబైల్లో ఫీడ్ చేసుకున్న సింగరేణి ఉన్నతాధికారుల పేర్లను, వారి ఫోన్ నంబర్లను బాధితులకు చూపించి వారంతా తనకు తెలుసునని నమ్మబలికేవాడు.
ఈ క్రమంలో మెడికల్ అన్ఫిట్లు, బదిలీలు, డిప్యూటేషన్లు చేయిస్తానని చెబుతూ బాధితుల నుంచి రూ.32 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయమై కొందరు బాధితుల నుంచి సింగరేణి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు విచారణ చేపట్టారు. పలువురు బాధితుల నుంచి రూ.32 లక్షలను రాజేశ్వరరావు వసూలు చేసినట్లు ధృవీకరించుకున్నారు. నివేదికలు, రికార్డులను ఏసీబీ అధికారులకు అప్పగించారు. వీటి ప్రకారం ఏసీబీ అధికారులు కూడా రంగంలోకి దిగి బాధితుల నుంచి వివరాలు తెలుసుకొని నిర్ధారించుకున్నారు.
ఈ క్రమంలో రాజేశ్వరరావును మంగళవారం అతడి ఇంటి వద్ద ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వరంగల్‌లోని ఏసీబీ జడ్జి ఎదుట బుధవారం హాజరుపర్చనున్నారు. రాజేశ్వరరావు బ్యాంకు లావాదేవీలు, ఫోన్ల ఆధారంగా విచారణ కొనసాగించనున్నారు. బాధితుల సంఖ్య, వారి నుంచి వసూలు చేసి మొత్తం నగదు వంటివి ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సింగరేణి విజిలెన్స్కుగానీ, ఏసీబీ అధికారులకుగానీ ఫిర్యాదు చేయవచ్చు.