కారేపల్లి, సెప్టెంబర్ 09 : గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కారేపల్లి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ మాట్లాడారు. గిరిజన సమాజం విద్య, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధిలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆ సమస్యలు రూపుమాపేందుకు లక్షలాది మంది శిక్షణ పొందిన కార్యకర్తల ద్వారా కృషి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ స్థాయిలో సేవలను మెరుగుపరచడం, గిరిజన సంస్కృతిని సంరక్షించడం, స్థానిక ప్రజలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా భాగస్వాములు కావొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ సూర్యం, ఏఎల్ఓ ఎల్.రాములు పాల్గొన్నారు.