ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూ వ్యవహారంలో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కోరింది. ఈ మేరకు ఆదివారం ఖమ్మం నగరంలోని సీపీ కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు, ప్రేరేపించిన అంశాలు, కేసుల నమోదులో జరిగిన పరిణామాలు వంటి అంశాలను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదాహరణంగా వివరించారు. బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కొద్దిసేపటికి ముందు ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ అందుకు కారకులైన వారి పేర్లను వీడియో ద్వారా వెల్లడించారని, కాంగ్రెస్ నాయకుడు కూరపాటి కిషోర్ ప్రమేయాన్ని, తన వల్ల జరిగిన ఇబ్బందిని వివరించాడని, అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 12వ పేరుగా నమోదు చేశారని అన్నారు. ప్రభాకర్ తరఫున కలెక్టర్‌ను కలవడానికి తనతోపాటు రావాలని ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పుల్లయ్య, నాగుల్‌మీరాను కలెక్టరేట్లో కనిపించగా కోరారని తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా కక్ష పూరితంగా తమ పార్టీకి చెందిన నాయకులను ఏ-1, ఏ-3లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం రాజకీయ దురుద్దేశమే అని నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీపీ సునీల్‌దత్‌కు వివరించారు. పెద్ద మనిషిగా వెళ్లిన పుల్లయ్యపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని, అతడిపై కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న చెరువులో చేపపిల్లల పెంపకం అధికారికంగా ఏనాడూ జరగలేదని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు తెలిపారు. తహీసీల్దార్, ఎస్ఐలు ప్రభాకర్ విజ్ఞప్తిని పట్టించుకుపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని నిరంజన్‌రెడ్డి వివరించారు. 11సార్లు రైతుబంధు అందుకున్న ప్రభాకర్ ఇది తన భూమేనని నిరూపించుకోవాలన్న అవసరం ఏమోచిందని అన్నారు. ప్రజాప్రతినిధుల బృందం లేవనెత్తిన అంశాలను కూలంకుషంగా విన్న సీపీ ప్రభాకర్ మృతిపై లోతైన విచారణ జరుపుతామని నిందితులు ఎవరైనాసరే శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పగడాల నాగరాజు, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, బ్రహ్మయ్య, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్ పాల్గొన్నారు.