కౌలు రైతుల బతుకులకు కనీస భరోసా లేకుండాపోయింది. ప్రతి ఏటా కన్నీటి సేద్యం చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులనూ మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011’ అమలు చేసి కౌలు రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి రాష్ట్రంలోని కౌలు రైతులకు బహిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి న్యాయం చేస్తుందని, గుర్తింపుకార్డులు ఇస్తామని, ‘రైతుభరోసా’తోపాటు ఇతర పథకాలు, పంట రుణాలు సైతం అందిస్తామని స్పష్టం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా కౌలు రైతులను ఏమాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదు. -అశ్వారావుపేట, ఆగస్టు 19
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సుమారు 3.50 లక్షల వరకు రైతులు ఉన్నారు. వీరిలో 30 శాతం కౌలు రైతులు ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నా రికార్డుల్లో చూపలేకపోతున్నారు. అనధికారికంగా కౌలు రైతుల సంఖ్య 50 శాతం వరకు ఉండొచ్చు. ప్రభుత్వం గుర్తించకపోయినా.. బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోయినా.. కౌలు రైతులు మాత్రం బతుకుతెరువు కోసం ప్రతి ఏటా కన్నీటి సేద్యం చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ఇచ్చే ‘రైతుభరోసా’ నగదు ప్రోత్సాహం ఎక్కువ మంది వ్యవసాయం చేయని రైతులకే అందుతున్నది. కానీ భూమినే నమ్ముకుని సాగు చేస్తున్న కౌలు రైతులకు ఏ విధమైనా ఆర్థికసాయం అందడం లేదు. పంటలు పండినా లేకపోయినా భూ యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సిందే. రైతుభరోసా పథకం కూడా పట్టా ఉన్న భూయజమాని ఖాతాలోనే జమ అవుతోంది. రెక్కల కష్టంపైనే పంటలు సాగుచేసే కౌలు రైతు అన్నివిధాలా నష్టపోతున్నాడు. రికార్డుల్లో కౌలు రైతు ఎక్కడా కనిపించకపోవడం బాధాకరమైన విషయం.
ఆర్బీఐ ఉత్తర్వుల అమలేది..?
కౌలు రైతుల వ్యవహారంలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొంత ఉదారత చాటుకుంది. కౌలు రైతులతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల వారికి గరిష్ఠంగా బ్యాంకులు రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. సొంత భూమి ఉన్న రైతులకు పట్టా పాసు పుస్తకాలను ఆధారం చేసుకుని పంట రుణాలు ఇచ్చినట్లే కౌలు రైతులను ఆదుకోవాలని ఆర్బీఐ సూచించింది. కానీ కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు. ఏ ఆధారం లేకుండా కౌలు రైతులకు రుణాలు ఇవ్వటానికి ససేమిరా అంటున్నాయి. దీనికారణంగా ఆర్బీఐ ఉత్తర్వులు బుట్టదాఖలయ్యాయి.
కౌలు రైతుల డిమాండ్లు..
క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు గుర్తింపు విధానం ఉండాలి. భూమిపత్రాలతో సంబంధం లేకుండా పంట ఆధారిత రుణాలు మంజూరు చేయాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎదురయ్యే పంట నష్టాలను ఎదుర్కొనేందుకు పంటల బీమా, మద్దతు ధర కల్పించాలి. రైతులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కౌలు రైతులకూ వర్తింపజేయాలి. రుణ అర్హత కార్డుల విధానాన్ని పునరుద్ధరించాలి.
రుణ అర్హత కార్డులేవి..?
గతంలో కౌలు రైతులను ఆదుకునేందుకు రుణ అర్హత కార్డులు (ఎల్ఈసీ) జారీ చేశారు. వీటి ఆధారంగా కౌలు రైతులు బ్యాంకుల నుంచి కొంత రుణాలు పొందారు. పంటలు పండించిన తర్వాత వచ్చిన ఆదాయం నుంచి రుణాలను చెల్లించారు. కానీ ప్రస్తుతం వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి కౌలు రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నాడే తప్ప ఏ రకంగా సాయం అందుతుందన్న ఆశ కూడా పడటం లేదు. అచేతన స్థితిలో కనీస భద్రత లేని బతుకు వెళ్లదీస్తున్నాడు.
కాంగ్రెస్ హామీతో మోసపోయాం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీతో మోసపోయాం. కౌలురైతులకు గుర్తింపుకార్డులతోపాటు పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కౌలురైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసి రైతులకు అందించే అన్ని పథకాలను వర్తింపజేయాలి.
-కాసిన ముత్యాలు, కౌలు రైతు, అశ్వారావుపేట