ఖమ్మం వ్యవసాయం, జనవరి 23: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం కొత్త రకం ఎండు మిర్చి క్వింటా ధర రూ.19,500 పలికింది. మార్కెట్ కమిటీ అధికారుల గణాంకాల ప్రకారం.. ఉదయం జెండా పాటలో కొత్త రకం ఎండుమిర్చి క్వింటాకు ధర రూ.19,500, మధ్య రకానికి ధర రూ.18,000, కనిష్ఠ ధర రూ.13,500 చొప్పున నిర్ణయించి వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. ఏసీ రకం పంటను రైతులు కోల్డ్స్టోరేజీల నుంచి 58 బస్తాలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. వాటికి గరిష్ఠ ధర రూ.19,200 పలికింది. ఏసీ రకం కంటే సాధారణ రకం పంటకే అధిక ధర పలకడం విశేషం. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు భారీగా పెరగడంతో మార్కెట్కు కొద్ది రోజుల నుంచి 10 వేల నుంచి 20 వేల మిర్చి బస్తాలు వస్తున్నాయి. శని, ఆదివారాలు మార్కెట్కు సెలవు కావడంతో సోమవారం ఒకే రోజు మార్కెట్కు 40 వేల బస్తాలు వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు.