ఇల్లెందు, ఫిబ్రవరి 19 : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది రాజకీయ స్వార్థపరులు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, వారికి ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఇల్లెందు మున్సిపాలిటీపై ప్రభావం చూపాయన్నారు.
కన్న తల్లిలాంటి పార్టీలో లబ్ధిపొంది పార్టీకి ద్రోహం తలపెడుతున్నారని, వారి మాయలో పడొద్దని కౌన్సిలర్లకు హితవుపలికారు. మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ ప్రాబల్యం కోసం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సంతకం చేయాలని 2వ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతిని కనకయ్య ఫోన్లో అడిగాడని అన్నారు. మూడేళ్లుగా చైర్మన్, కౌన్సిలర్లు మున్సిపల్ అభివృద్ధికి కలిసి పనిచేయడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి లో అనేక ర్యాంకులు వచ్చాయనే విషయాన్ని మరువొద్దన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి సంబంధంలేని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇప్పుడు తన స్వార్థం కోసం పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారని, కొంతమంది కౌన్సిలర్లు వారి మాయలో పడి తప్పుదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు సమస్యలుంటే ప్రజల మధ్య ఉండి కొట్లాడాలని స్పష్టం చేశారు. ఎవరూ మిమ్ములను బెదిరించకపోతే ఎందుకు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకున్నారని, నిర్భయంగా బయటకు వచ్చి నిజాలను ప్రజలకు చెప్పాలన్నారు.
సిండికేట్ గణేష్‌గా పిలువబడుతున్న వ్యక్తి స్వలాభం కోసం మిమ్ములను దోషులుగా చిత్రీకరిస్తున్నాడని, పట్టణంలో మీరు బదనాం అవుతున్న విషయం గ్రహించాలని కోరారు. పార్టీకి నష్టం చేస్తున్న వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకూ తాతా మధు ఇల్లెందుకు ఇన్చార్జిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి నష్టం కలిగించే వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తనపై వ్యక్తి గత ఆరోపణలు చేస్తున్న వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని, అలాగే తాను తప్పు చేస్తే పార్టీ పరంగా చర్యతీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు బంధు సమితి రాష్ట్ర నాయకుడు పులిగళ్ల మాధవరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్, వైస్‌చైర్మన్ జానీపాషా, కౌన్సిలర్లు జేకే శ్రీను,వారా రవి, అజాం, నవీన్, కటకం పద్మావతి, లక్ష్మి, వీణ, నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, గణేష్, పీవీ కృష్ణారావు, మహేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.