సత్తుపల్లిటౌన్/ చండ్రుగొండ, డిసెంబర్ 3: అతి వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక విద్యార్థితోపాటు ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లి పట్టణంలోని కొత్త కామేపల్లి కాలనీకి చెందిన సిద్దేసి శ్రీనివాసరావు కుమారుడు జాయ్(18) తన తండ్రికి తెలియకుండానే ఇంట్లో నుంచి కారు తీసుకొని మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మర్సకట్ల శశిధర్ (11)ను వెంటబెట్టుకొని భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.
అక్కడి నుంచి తలారి అజయ్‌ను, చండ్రుగొండ మండలం మహ్మద్ నగర్‌కు వెళ్లి అక్కడ సాజిద్, ఇమ్రాన్‌లను తమతోపాటు కారు ఎక్కించుకొని వీఎం బంజర మీదుగా సత్తుపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో సాజిద్ నడుపుతున్న కారు కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ ప్రమాద ధాటికి కారులో ప్రయాణిస్తున్న యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

వీరిలో కొత్త కామేపల్లి కాలనీకి చెందిన సిద్దేసి జాయ్, మర్సకట్ల శశిధర్, చండ్రుగొండ మండలం మహ్మద్ నగర్‌కు చెందిన సాజిద్ (21)లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు యువకులు తలారి అజయ్, ఇమ్రాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐ శ్రీహరి.. కారు అతివేగంగా, బలంగా డివైడర్‌ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఖమ్మం, మరొకరిని హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి మృతదేహాలను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.