ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 23: గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి ఆదివారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరిగింది. ఖమ్మం జిల్లాలో 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 కేంద్రాల్లో ఈ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో 6404 మందికిగాను 6286 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5089 మందికిగాను 4942 మంది హాజరయ్యారు. మొత్తం హాజరు 97 శాతంగా నమోదైంది. పరీక్ష కేంద్రాలను భద్రాద్రి జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి, జిల్లా అబ్జర్వర్ కె.వేణుగోపాల్ సందర్శించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని ఎస్‌బీసీఈ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసేందుకు మోదుగు కృష్ణమనోహర్, ఎం.ధీరజ్ వచ్చారు. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీనికి కారణాలను వారికి అధికారులు వివరించారు. “నిబంధనల ప్రకారం.. పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రెండులక్షల రూపాయలు మించకూడదు. ఈ ఇద్దరు తల్లిదండ్రుల వార్షికాదాయం రెండులక్షల రూపాయలకు మించి ఉంది. ఆ విద్యార్థులు సమర్పించిన ఇన్‌కం సర్టిఫికెట్లో ఇది ఉంది. ఈ కారణంగా, వీరిద్దరూ అనర్హులుగా హెడ్ ఆఫీస్ రిజెక్ట్ చేసింది. కానీ, వారికి మొదట ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా హాల్ టికెట్ వచ్చింది. ఆ తర్వాత, స్క్రూట్నీలో రిజెక్ట్ చేశారు. కలెక్టర్‌కు ఈ సమాచారం ఇచ్చాం” అని, ‘నమస్తే’కు జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి వివరించారు.
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 23: కొందరు అధికారులు అనుసరించిన నిర్లక్ష్యానికి ఓ విద్యార్థికి తీవ్రనష్టం వాటిల్లింది, వివరాల్లోకెళ్తే ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. అందులో భాగంగా ఖమ్మంజిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద స్వర్ణభారతి కళాశాలలో ప్రవేశపరీక్షకు సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే తప్పిదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విద్యార్థులకు ఒకే హాల్‌టికెట్ నెంబర్ కేటాయించారు. దీంతో ఓ విద్యార్థి ప్రవేశ పరీక్ష రాశాడు. మరో విద్యార్థికి సంబంధించిన తల్లి తన కొడుకు ఎట్టి పరిస్థితిలో పరీక్ష రాసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి నష్టపోయిన విద్యార్థికి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామని గురుకుల పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఫిబ్రవరి 23: నవభారత్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన టీజీ సెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం; 6, 7, 8 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని గమనించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 460 మంది విద్యార్థులకు గాను 444 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు.