ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసి 75.19 శాతంగా నమోదైంది. అయితే జిల్లాలో కొన్నిచోట్ల ఉదయం సమయంలో ఈవీఎంలు మొరాయించగా అధికారులు తక్షణం స్పందించి పోలింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో, అత్యల్పంగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లోపోలింగ్ శాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల కన్నా కొంతమేర పోలింగ్ శాతం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని అని వర్గాల ప్రజలూ పోలింగ్‌కు బారులు తీరారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఖమ్మం సీపీ సునీల్‌దత్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాద్రి జిల్లా గుండాల మండలం పెద్దతోగు బూత్‌లో గ్రామస్తులు ఓట్లు వేయకుండా గ్రామంలో బైఠాయించారు. ఆ గ్రామంలో 102 మంది ఓటర్లుండగా ఆ గ్రామంలోని బూత్‌లో కేవలం 21 మందికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. మిగతా వారికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల మండల కేంద్రంలోని బూత్‌ను కేటాయించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. అంతదూరం తాము వెళ్లలేమని, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రకార్డులు ప్రదర్శిస్తూ గ్రామంలో బైఠాయించారు.
అధికారులు సర్దిచెప్పడంతో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, తాగునీరు, సాగునీరు సహా గ్రామ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏన్కూరు మండలం రాయమాధారం, లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల, ఇల్లెందు మండలం కొమ్మగూడెం గ్రామాల్లో గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లి ఓటర్లకు నచ్చచెప్పారు. పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన అనంతరం ఓటర్లు తమ నిరసన మిరమించి ఓటింగ్‌కు హాజరయ్యారు.
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం నెహ్రూనగర్‌లో, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం బుర్హాన్‌పురంలో, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం నగరంలో, ఎమ్మెల్సీ తాతా మధు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లిలో, కందాల ఉపేందర్‌రెడ్డి కూసుమంచిలో, వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు వైరాలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిరలో, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్ వైరాలో, రాగమయి సత్తుపల్లిలో, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయిన చోట పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య జిల్లా కేంద్రానికి తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని, ఈవీఎంలను క్రమపద్ధతిలో కాకుండా వెనుకనుంచి ముందుకు అమర్చారని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు.
బోనకల్లు మండలం ఆళ్లపాడులో స్వతంత్ర ఏజెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ఏజెంట్ దాడి చేశాడు. బాధిత ఏజెంట్ కథనం ప్రకారం.. బీఆర్ఎస్ కార్యకర్త మరీదు వెంకయ్య ఆళ్లపాడు 133వ బూత్‌లో స్వతంత్ర ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏజెంట్ నరసింగుల సతీశ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళా ఓటరుతో వెళ్లి ఈవీఎం బటన్ నొక్కాడు. దీనిపై బీఆర్ఎస్ ఏజెంట్ నల్లబోయిన కృష్ణారావు, బీఆర్ఎస్ కార్యకర్త అయిన స్వతంత్ర ఏజెంట్ మరీదు వెంకయ్య అభ్యంతరం తెలిపారు.
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆక్రోశంతో ఊగిపోయారు. ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బండి గోపి అనుమతిలేనప్పటికీ పలువురు ఓటర్లను పదేపదే బూత్‌లోకి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించే ప్రయత్నం చేశాడు. దీనిపై బీఆర్ఎస్ చెందిన ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షాత్తూ పోలింగ్ ఆఫీసర్లు, సీసీ కెమెరాల సాక్షిగా బీఆర్ఎస్ కార్యకర్త అయిన స్వతంత్ర ఏజెంట్ మరీదు వెంకయ్య ముఖంపై కాంగ్రెస్ ఏజెంట్ సతీశ్ పిడిగుద్దులు గుద్దాడు. అక్కడున్న ఏజెంట్లు, ఓటర్లు, ఇతరులు సముదాయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.