భద్రాచలం/ బూర్గంపహాడ్/ చర్ల/ దుమ్ముగూడెం/ పర్ణశాల/ మణుగూరు టౌన్/ అశ్వాపురం, ఆగస్టు 21 : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 51.90 అడుగులకు ప్రవాహం చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉధృతంగా పెరుగుతున్న గోదావరి.. గురువారం సాయంత్రం వరకు ఉధృతంగా ప్రవహించింది. 24 గంటల్లో 12.9 అడుగుల మేర పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ గురువారం రాత్రి 11 గంటలకు 51.40 వద్ద నిలకడగా ఉంది. అయితే, ఎగువన శ్రీరాంసాగర్ గేట్లు మూసివేయడంతోపాటు పేరూరు, కాళేశ్వరం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద కూడా ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్లు కేంద్ర జల సంఘం అధికారులు, ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
భద్రాచలం వద్ద బుధవారం రాత్రే రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. భద్రాచలం ఆలయం వద్ద కల్యాణకట్ట వద్ద వరద వచ్చి చేరడంతో భక్తులను అటువైపుగా వెళ్లకుండా నిరోధించారు. స్నానఘట్టాలు ఇప్పటికే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో వాగులు పోటెత్తి వరద రహదారులపైకి చేరడంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
భద్రాచలం – వెంకటాపురం మార్గంలో ఎటపాక వద్ద, తూరుబాక వద్ద, గంగోలు వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భద్రాచలం ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారిపై నెల్లిపాక వద్ద మోకాలిలోతుకు పైగా నీళ్లు నిలిచాయి. దీంతో అటువైపు కూడా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భద్రాచలం నుంచి 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లయింది. ఇక భద్రాచలంలో అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతిని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించారు.
గోదావరి పొంగడంతో బూర్గంపహాడ్ మండలంలోని కోయగూడెం, తాళ్లగొమ్మూరు, ఇరవెండి, మోతే, బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సోంపల్లి గ్రామాలు, అశ్వాపురం మండలంలోని నెల్లిపాక, చింతిర్యాలకాలనీ తదితర గ్రామాల ప్రజలు భయానికి గురవుతున్నారు. బూర్గంపహాడ్ మండలంలో బూర్గంపహాడ్ – సోంపల్లి, ఇరవెండి – అశ్వాపురం, సారపాక – నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్ – నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదారులపైకి వరద చేరడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మోతేపట్టీనగర్లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు కూడా వరదలో మునిగిపోయాయి.
అలాగే, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గంగరాజు యాదవ్కు చెందిన ఏడు ఎకరాల పత్తి పంటతోపాటు లోతట్టు ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో పంట పొలాలు కూడా నీట మునిగాయి. బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లోనూ, వరద చుట్టుముట్టిన ప్రాంతాల్లోనూ మండల అధికారులు గురువారం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మూడు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బూర్గంపహాడ్ కొల్లు ఏరియాలోని రెండు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ఇళ్ల సమీపానికి గోదావరి వరద వస్తోంది. మరోవైపు దండుపేట – కొత్తపల్లి ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద 25.5 అడుగులకు గోదావరి ప్రవాహం చేరింది. చర్ల – భద్రాచలం ప్రధాన రహదారిపైకి తూరుబాక, గంగోలు వద్ద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తూరుబాక డైవర్షన్ రోడ్డుపై వరదనీరు భారీగా ప్రవహించడంతో రోడ్డు సైతం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది.
మణుగూరు మండలం చిన్నరావిగూడెం లిప్టు ఇరిగేషన్ పుష్కర ఘాట్ల పైకి గోదావరి నీరు వచ్చింది. దీంతో చిన్నరావిగూడెం – పాములపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల ప్రధాన రహదారిపై కూడా వరద నీరు చేరింది. చారిత్రక సీతమ్మవారి నార చీరెల ప్రాంతం కొద్ది రోజులుగా పూర్తిగా నీటిలోనే మునిగి ఉంది. అశ్వాపురం మండలం కడియాల బుడ్డివాగు వద్ద గోదావరి వరద ఉధృతికి రోడ్డుపైకి వరద వచ్చింది. మొండికుంట – ఇరవెండి మీదుగా భద్రాచలానికి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.