Yellandu | ఇల్లెందు, అక్టోబర్ 31 : భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కనీసం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. వానకాలం వస్తే ఏజెన్సీ అంతా జలదిగ్బంధంలోనే ఉండేది. వాగులపై వంతెనలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లోనూ గ్రామాలకే పరిమితం కావాల్సి వచ్చేది. గ్రామస్తులు ప్రాణాలకు తెగించి నిండు గర్భిణులను వాగులు దాటించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సరైన తాగునీటి వసతి లేక ఏజెన్సీవాసులు వాగులు, చెలిమెలను ఆధారం చేసుకునేవారు. లేదా కిలోమీటర్లు నడిచి వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లేవారు. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది పోడు చేసుకునేవారే. పేరుకు వారికి భూమి ఉండేది కానీ ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయమూ అందేది కాదు. నాటి ప్రభుత్వాలు పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో తరచూ ఏదో చోట అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఇదీ నాటి ఇల్లెందు నియోజకవర్గ ముఖచిత్రం.
తెలంగాణ వచ్చిన తర్వాతే నియోజకవర్గ రూపురేఖలు మారాయి. రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా నియోజకవర్గంలోని 410 చెరువుల్లో పూడిక తీయించింది. చెరువు కట్టలను పటిష్టం చేసింది. కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించింది. 17 చోట్ల రూ.123.53 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించింది. చెరువులు, చెక్‌డ్యాంల ద్వారా నియోజకవర్గంలో భూగర్భజలాలు దండిగా పెరిగాయి. మిషన్ భగీరథ ద్వారా సర్కార్ నియోజకవర్గవ్యాప్తంగా 687కి.మీల పైపులైను నిర్మించింది. రూ.173.87 కోట్లతో 482 ట్యాంకులు నిర్మించింది. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు 55,735 వేల మంది ఖాతాల్లో రూ.715.61 కోట్లు జమ చేసింది. వివిధ కారణాలతో నియోజకవర్గవ్యాప్తంగా 1,025 మంది మృతిచెందగా ఒక్కో నామినీ ఖాతాలో రూ.5 లక్షల చొప్పున రూ.51.25 కోట్లు జమ చేసింది. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పటివరకు 11,124 మంది లబ్ధిదారులకు రూ.107.47 కోట్ల సొమ్ము అందింది. నెలనెలా ఆసరా పింఛను ద్వారా 42,867 మంది ఖాతాలో రూ.9 కోట్లు జమ అవుతున్నాయి. 2,686 మంది గొల్ల కురుమలకు రూ.26.65 కోట్ల విలువైన గొర్రెల యూనిట్లు అందాయి. నియోజకవర్గవ్యాప్తంగా సర్కార్ రూ.33.56 కోట్లతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించింది. ఇప్పటివరకు 670 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు అప్పగించింది.
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా 116 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో రూ.22.26 కోట్లతో సర్కార్ అభివృద్ధి పనులు చేపట్టింది. హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా రూ.19.80 కోట్లతో ప్లాంటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నర్సరీల్లో వేలాది మొక్కల పెంపకం జరుగుతున్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,271 మందికి రూ.4.82 కోట్ల సాయం అందింది. నియోజకవర్గవ్యాప్తంగా 1,600 మంది మహిళలకు రూ.45 లక్షల విలువైన కేసీఆర్ కిట్లు అందాయి. 800 మంది గర్భిణులకు రూ.30 లక్షల విలువైన న్యూట్రిషన్ కిట్లు అందాయి. ఇల్లెందు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని రూ.37.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రిగా మార్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో పది మంది వైద్యనిపుణులు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. రోజువారీ ఓపీ 500- 700 వరకు ఉంది. కిడ్నీ బాధితుల కోసం ఆస్పత్రి పరిధిలో ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నియోజకవర్గవ్యాప్తంగా 15,107 మంది రైతులకు 48,300 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలు అందాయి. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఐటీడీఏతోపాటు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో సర్కార్ మొత్తం రూ.1,769.64 కోట్ల విలువైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, బ్రిడ్జీలు, డివైడర్లు, సెంట్రల్‌లైటింగ్, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కలిపి సర్కార్ ఇప్పటివరకు నియోజకవర్గానికి రూ.2,957.43 కోట్లు వెచ్చించింది.
ఇల్లెందులో బస్ డిపో ఉండాలని ఇక్కడి ప్రజలు ఆరు దశాబ్దాలుగా కోరుతున్నారు. కానీ గతంలో ఏ ప్రభుత్వమూ ఈ డిమాండ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత చేతులు దులిపేసుకోవడం తప్ప హామీని నెరవేర్చలేదు. ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే కేసీఆర్ బస్ డిపో నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.5.50 కోట్ల నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన బస్ డిపో నిర్మించి ప్రజల చిరకాల వాంఛను తీర్చారు.