యాదగిరిగుట్ట, ఫిబ్రవరి19: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండో రోజు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తంచేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, మహా కుంభారాధన, చతుస్థానార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సభాస్థానంలో స్వామివారిని పెండ్లికొడుకు చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు.
లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కొనసాగించేలా అనుగ్రహించాలని భగవానుడిని వేడుకుంటూ చేసే ఈ పర్వాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నా యి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.