ఖమ్మం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను జ్వరాలు చుట్టుముడుతున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు ప్రధానంగా డెంగీ జ్వరాలతో జిల్లా ప్రజ లు అల్లాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ జ్వ రాలు విజృంభిస్తున్నా ప్రభుత్వ వైద్యశాలల్లో అందుకు తగిన సదుపాయాలు అందుబాటు లో ఉండడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లలేని వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని గ్రామాల్లో డెంగీ, చికున్‌గున్యా జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లోని బెడ్లు ఏమాత్రమూ సరిపోవడం లేదు. అశ్వారావుపేట, పెనుబల్లి ప్రాం తాల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున చికిత్స పొందుతున్నారు. చాలా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు, ఇతర సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదు. రోగులే బయట కొనుగోలు చేస్తున్నారు. మధిర ప్రభుత్వాసుపత్రిలో సీరియస్ కేసులను, రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఆసుపత్రికి పంపుతున్నారు. చివరికి బూర్గంపహాడ్ ఆసుప్రతికి వచ్చిన మృతదేహాలను కూడా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు.
ఖమ్మంలో 348 డెంగీ కేసులు..
ఖమ్మం జిల్లాలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 14,740 మంది నుంచి వైద్య అధికారులు శాంపిల్స్‌ను సేకరించగా.. వారిలో 348 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. జిల్లాలో డెంగీ జ్వరాల విజృంభణ ఏస్థాయిలో ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం పడకేయడంతో దోమలు అమాంతం వ్యాప్తి చెందాయి.
ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి పెట్టలేదంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. జ్వర పీడితులు అధికంగా వస్తున్నారు.
పెనుబల్లి ఆసుపత్రి నిండా రోగులే..
పెనుబల్లి, ఆగస్టు 13 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల సీజనల్ వ్యాధులు విజృంభించడంతో పెనుబల్లి ఆసుపత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. రోజుకు 150 నుంచి 200 మంది వరకూ ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇన్ పేషెంట్లకు ఆసుపత్రిలోని బెడ్లు సరిపోవడం లేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్స పొందుతున్నారు.
బెడ్లు ఖాళీగా లేని కారణంగా చాలా మంది రోగులు, జ్వర పీడితులు సాయంత్రం వరకూ చికిత్స పొంది రాత్రికి ఇళ్లకు వెళ్తున్నారు. జ్వర తీవ్రత అధికంగా ఉన్న వారు మళ్లీ ఉదయాన్నే ఆసుపత్రికి వస్తున్నారు. ఒకవేళ బెడ్ ఖాళీ అయితే దానిపై చికిత్స పొందుతున్నారు. మరికొందరు రోగులైతే ఆసుపత్రిలోని బల్లలపై కూడా పడుకొని చికిత్స చేయించుకుంటున్నారు. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న రోగులను ఇక్కడి వైద్యులు ఖమ్మం పంపిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్ జ్వరాల కేసులు కూడా నమో దవుతున్నాయి.
సత్తుపల్లిలో తీవ్రంగా వైద్యుల కొరత..
సత్తుపల్లి టౌన్, ఆగస్టు 13 : సత్తుపల్లి ఆసుపత్రికి వచ్చే రోగుల్లో సింహభాగం జ్వర పీడితులే ఉంటున్నారు. ఇంతకు ముందు వరకూ 300 వరకూ ఉండే ఔట్ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు జ్వరాల సీజన్ కారణంగా 400కు చేరింది. 30 బెడ్ల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో వాటికి సరిపడా రోగులు ఇన్ పేషెంట్లుగా నమోదవుతున్నారు. కానీ ఇక్కడ వైద్యుల సమస్య ప్రధానంగా వేధిస్తోంది.
59 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సర్కారు వైద్య రంగానికి పెద్దపీట వేసిన గత కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే కోట్లాది రూపాయలతో సత్తుపల్లిలో వంద బెడ్ల ఆసుప్రతిని నిర్మించింది. కానీ ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఇంకా ప్రారంభించలేదు. దీనికితోడు వైద్యుల కొరత కూడా ఉండడంతో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్య సేవలు అందడం లేదు.
విలీన మండలాల రోగులూ బూర్గంపహాడ్కే..
సారపాక, ఆగస్టు 13 : సీజనల్ వ్యాధులతోపాటు జ్వరాలు విజృంభించిన వేళ బూర్గంపహాడ్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ మండలంలోని రోగులేగాక పొరుగున్న ములకలపల్లి, ఏపీలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల రోగులు కూడా వైద్య సేవల కోసం ఈ ఆసుపత్రికే వస్తున్నారు. 30 బెడ్లు ఉన్నప్పటికీ రోగులకు సంఖ్యకు అవి సరిపోవడం లేదు. కేవలం ఔట్ పేషెంట్లే రోజుకు సుమారు 200 మంది వరకూ వస్తున్నారంటే రోగులు, జ్వర పీడితుల తాడికి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోగుల సంఖ్య అధికంగా ఉండే ఈ ఆసుపత్రి భవనం శిథిలావస్థలో ఉంది. నూతన ఆసుపత్రి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.2.70 కోట్లు మంజూరు చేసినప్పటికీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టడం లేదు. ఇక ఈ ఆసుపత్రిలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మరుగుదొడ్లు, మంచినీళ్ల వంటి కనీస సౌకర్యాలు లేవు. 20 రోజుల క్రితం పోస్టుమార్టం గది స్లాబ్ ఊడి వైద్యుడిపై తలపై పడింది. ఆ శవాల గది కూడా కూలిపోయే దశలో ఉంది. ఇక్కడికి వచ్చిన మృతదేహాలను స్థానిక వైద్యులు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు.
‘పేట’లో ఒక్కో బెడ్‌పై ఇద్దరికి చికిత్స..
అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 13 : జ్వరాల విజృంభణ కారణంగా అశ్వారారావుపేట సామాజిక ఆరోగ్యం కేంద్రంలో దయనీయ దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఒక్కో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు ఆసుప్రతి ఆవరణలోని బల్లలపైనే పడుకొని ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇటీవలి జ్వరాల కారణంగా ఈ ఆసుపత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. ఈ ఆసుపత్రిలో 30 బెడ్లు ఉన్నప్పటికీ అందులో కేవలం 15 బెడ్లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. మిగిలిన 10 బెడ్లు ప్రసూతి సేవలకు, మరో 5 బెడ్లు డయాల్సిస్ సేవలకు వినియోగిస్తున్నారు.
ఈ ఆసుపత్రికి నిత్యం 200 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇందులో 50 మంది జ్వర పీడితులే ఉంటున్నారు. బెడ్లు ఖాళీ లేని కారణంగా ఇంకా చాలామంది రోగులు రోజూ ఇంటి నుంచి వచ్చి వెళ్తూ చికిత్స పొందుతున్నారు. కాగా, గడిచిన మూడు నెలల కాలంలో ఈ ఆసుపత్రిలో 40 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మృతిచెందారు. ఈ మండలంలోని అశ్వారావుపేట, గుమ్మడివల్లి ఆరోగ్య కేంద్రాల్లో ఇటీవల టైఫాయిడ్, వైరల్ ఫీవర్ రోగులే అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనికి తోడు ఈ ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. 12 మంది నర్సింగ్ ఆఫీసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు జ్వరంతో సెలవులో ఉన్నారు. ఉన్న ఐదుగురు డాక్టర్లలో ఇద్దరు 24 గంటల చొప్పున 15 రోజులపాటు నిర్విరామంగా విధుల్లో ఉండాల్సిన పరిస్థితి.
నేలకొండపల్లిలో 110 మంది ఇన్ పేషెంట్లు..
కూసుమంచి (నేలకొండపల్లి), ఆగస్టు 13 : నేలకొండపల్లి 30 బెడ్ల ఆసుపత్రి కూడా జ్వర పీడితులతో కిటకిటటాడుతోంది. సోమవారం సుమారు 500 మందికిపైగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి వచ్చారు. వారిలో 110 మందికి తీవ్ర జ్వరం ఉండడంతో వైద్యులు వారిని ఇన్ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. వెనువెంటనే స్లైన్లు పెట్టి ట్రీట్మెంట్ ప్రారంభించారు. వారిలో కొందరికి మందులు ఇచ్చి సాయంత్రానికి ఇంటికి పంపించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 390 మంది ఔట్ పేషెంట్లు నమోదయ్యారు. రాత్రి షిఫ్టు వరకూ మరో 150 మంది వరకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఆసుపత్రిలో కేవలం 30 బెడ్లు మాత్రమే ఉండడంతో జ్వరం తీవ్రత అధికంగా ఉన్న వారికి మాత్రమే బెడ్లు కేటాయిస్తున్నారు.
మధిరలో రోజుకు 300 మంది ఔట్ పేషెంట్లు..
మధిర, ఆగస్టు 13 : మధిర ఆసుపత్రికి కూడా జ్వర పీడితుల తాకిడి తీవ్రంగానే ఉంది. ఇటీవల జ్వరాల తీవ్రత పెరిగిన నేపథ్యంలో రోజుకు 250 నుంచి 300 మంది వరకూ ఔట్ పేషెంట్లు వస్తున్నారు. 25 నుంచి 30 మంది వరకూ ఇన్‌పేషెంట్లు నమోదవుతున్నారు. ఆసుపత్రి భవనం కూడా శిథిలావస్థలో ఉంది. నలుగురు వైద్యులు, 27 మంది నర్సింగ్ సిబ్బంది సేవలందిస్తున్నారు.
సివిల్ సర్జన్ ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో రోగులకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇటీవల రక్త పరీక్షలు నిర్వహించే బిల్డింగ్ పెచ్చులు ఊడి పడిపోవడంతో ప్రస్తుతం ఒక రేకుల షెడ్లో రక్త నమూనాలు సేకరించి ఖమ్మం టీ హబ్‌కు పంపిస్తున్నారు. ఒక్క గదిలోనే వైద్యులు రోగులకు పరీక్షలు చేస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వంద బెడ్ల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి నిర్మాణాలు పూర్తిచేసిన విషయం విదితమే. కానీ ప్రారంభించలేదు. తీవ్రమైన సౌకర్యాల కొరత ఉన్న పాత ఆసుపత్రిలోనే ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు.