
మంత్రి పువ్వాడ సారథ్యంలో నగరానికి ప్రత్యేక గుర్తింపు
జీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మంలోనే ప్రగతి
అన్ని డివిజన్లకు సమానంగా నిధుల కేటాయింపు
కేఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ
అభివృద్ధిపై విమర్శలు చేస్తే సహించం
ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు
ఖమ్మం, అక్టోబర్ 30: మంత్రి అజయ్ సారథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఫలితంగా అన్ని రంగాలూ అగ్రభాగాన నిలుస్తున్నాయని మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. కేఎంసీ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత ఖమ్మం నగరమే అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి అజయ్‌కుమార్ ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. విశాలమైన రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పారిశుధ్యం వంటి చర్యలతో ఖమ్మం నగరం గ్రీన్ సిటీగా ముస్తాబవుతోందని అన్నారు. ప్రతి డివిజన్లో ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పాలకవర్గం ఏర్పడిన ఈ ఆరు నెలల కాలంలో రూ.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా అన్ని పార్టీల సభ్యుల ప్రాతినిధ్యం ఉన్న డివిజన్లూ తమకు సమానమేనని, అన్ని డివిజన్లకూ సమానంగా నిధులు కేటాయిస్తామని వివరించారు.
అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం..
మేయర్ ప్రసంగం అనంతరం పలువురు అధికార, ప్రతిపక్షాల కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తి అభివృద్ధిపై మాట్లాడారు. బీజేపీ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ స్పందిస్తూ.. ఖమ్మం అభివృద్ధిలో కేంద్రం నిధులు కూడా ఉన్నాయని, ఆ విషయాన్ని మేయర్ చెప్పడం లేదని, టేకులపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం లేదని అన్నారు. దీనికి టీఆర్ఎస్ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి దీటుగా స్పందించారు. మంత్రి అజయ్‌కుమార్ స్వయంగా సత్యనారాయణను ఆహ్వానించి స్టేజీపై కూర్చోబెట్టారని గుర్తుచేశారు. ఏ అభివృద్ధి పథకంలో కేంద్రం నిధులు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. బీజేపీ కార్పొరేటర్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని మంజుల వచ్చి మాట్లాడుతుండగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయా? అని కర్నాటి ప్రశ్నించారు. ఇదే సందర్భంలో కమర్తపు మురళి, దొంగల సత్యనారాయణ మధ్య, కర్నాటి, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: కర్నాటి
మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీఆర్ఎస్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ సవాల్ విసిరారు. అనవసరంగా మంత్రిపైనా, అభివృద్ధి పనులపైనా విమర్శలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేయాలి: కమర్తపు
ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేయాలని టీఆర్ఎస్ కార్పొరేటర్ కమర్తపు మురళి కోరారు. ఖమ్మంలో 93 వేల ఇండ్లు ఉంటే 42 వేల ఇండ్లకే ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారని, అందరికీ ట్యాక్స్‌లు వేస్తే మరో రూ.30 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు.
28 అంశాకు కౌన్సిల్ ఆమోదం..
టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, రాపర్తి శరత్, ప్రశాంతలక్ష్మి, దోరేపల్లి శ్వేత, నాగండ్ల కోటేశ్వరరావు, మక్బుల్, సీపీఐ కార్పొరేటర్ క్లెమెంట్, కాంగ్రెస్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, సీసీఎం కార్పొరేటర్లు ఎర్రా గోపి, వెంకట్రావు పలు సమస్యలపై మాట్లాడారు. అనంతరం 28 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.