
రెండేళ్ల క్రితం క్వింటాకు రూ.20 వేలకు పైగా..
గతేడాది రూ.17 వేలు పలికిన ధర
ఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగు
ప్రస్తుతం రూ.13,000కు చేరిన వైనం
ఆందోళనలో రైతాంగం
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 30: గతేడాది చివరలో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుతం తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం మిర్చి సాగు చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేపట్టి ధరలను చూసి నిరాశ చెందుతున్నారు. ఇరుగు పొరుగు రాష్ర్టాల్లోనూ మిర్చి సాగు పెరిగింది. జాతీయ స్థాయిలో మిర్చికి మద్దతు ధర లేదు. ధర లేకపోవడం ఖరీదుదారులకు వరమైంది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్ల్లాలకు చెందిన రైతులు మాత్రమే తేజ మిర్చి సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంటలో 90శాతం చైనా, థాయ్‌లాండ్, బ్యాంకాంక్, సింగపూర్‌కు ఎగుమతి అవుతున్నది. సాధారణ రకం పంటను ఇక్కడే ప్రాసెసింగ్ చేసి వినియోగంలోకి తీసుకొస్తుంటారు. ఏటా జనవరి నుంచి మే వరకు ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, ఏపీలోని సరిహద్దు జిల్లాల రైతులు ఖమ్మం మార్కెట్‌కు మిర్చి తీసుకువస్తారు. ఇక్కడ ఎక్కువ మిర్చి అమ్మకాలు జరుగుతుంటాయి. రెండేళ్ల క్రితం ఒక క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పలికింది. గతేడాది రూ.17 వేల పైచిలుకు పలికింది. శుక్రవారం జెండాపాటలో ఒక క్వింటాకు గరిష్ఠంగా రూ.13,000 పలికింది.
భారీగా మిర్చి సాగు.. : ఒక రైతు ఒక పంట సాగు చేసి సక్సెస్ అయితే మరుసటి ఏడు మిగతా రైతులు అదే పంట పండించడానికి ఇష్టపడుతున్నారు. గత సంవత్సరం ధర పలికిన పంటను ఈ ఏడాది కూడా సాగు చేస్తుండడంతో డిమాండ్ తక్కువై ధరల తగ్గుదలకు ప్రధాన కారమవుతుంది. ప్రస్తుతం మిర్చి సాగు విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో ఏటా సాగు 50-55 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నది. కానీ ఈ ఏడాది 65,222 మంది రైతులు పత్తి సాగును వదిలి రికార్డు స్థాయిలో 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇంచుమించు పొరుగు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిల్వలు భారీగా ఉన్నాయి. దీంతో డిమాండ్ పడిపోయి వారం రోజుల్లో రూ.2 వేల వరకు ధర తగ్గింది. ధర తగ్గినా కొందరు ప్రస్తుత ధరలకే మిర్చి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో పత్తి ధరలు మరింత పెరిగి, మిర్చి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే సాగులో రైతాంగం అపరాలు, నూనె గింజలు సాగు చేస్తే మంచి లాభాలు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.