
రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలు ప్రారంభం
ఇప్పటికే పూర్తయిన శానిటైజేషన్ ప్రక్రియ
విద్యార్థుల కోసం వసతిగృహాలు ముస్తాబు
ఖమ్మం, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 17 నెలల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులను తెరుస్తుండడంతో పాఠశాలల్లో విద్యాబోధన గాడిలో పడనున్నది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల విద్యార్థులు వసతి పొందేలా ఆయా శాఖల అధికారులు వసతిగృహాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను శానిటైజేషన్ చేసి పరిసరాలు, మరుగుదొడ్లను శుభ్రం చేశారు.
ఉమ్మడి జిల్లాలో గురుకులాలు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో చదువుతోపాటు ప్రభుత్వం వసతిని కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారికి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖల ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బుధవారం నుంచి వసతి పొందేలా వాటిని సిద్ధం చేస్తున్నారు.
శుభ్రతకు పెద్దపీట
తరగతి గదులు, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. పంచాయతీ సిబ్బంది సహకారంతో శుభ్రం చేయించారు. అవసరమున్న చోట కుళాయిలు బిగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బుక్షాప్లు, స్టేషనరీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు యూనిఫాం నిబంధనలు ఉండడంతో విద్యార్థులు యూనిఫాంలు, షూస్, లంచ్ బాక్సులను కొనుగోలు చేసే పనిలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు.
వసతి గృహాలు సిద్ధం
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు రుచి, శుచికరమైన వంటలు చేసేందుకు అధికారులు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వసతిగృహాలకు అవసరమైనవి సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకొచ్చి బోధనలు చేయనున్నారు. విద్యాసంస్థల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
యాజమాన్యాలు సమాయత్తం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయా పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సుల్లో విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. బస్సుల ఫిట్నెస్కు సంబంధించి మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖా అధికారులు ఫిట్నెస్ బస్సులను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 1,629 పాఠశాలలు ఉండగా.. 122 జూనియర్ కళాశాలలు, ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,605 అంగన్వాడీ కేంద్రాలు, 232 మినీ కేంద్రాలు తెరుచుకోనున్నాయి.
ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కళాశాలల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తిచేశాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలలకు పంపించాల్సిన ఆవశ్యకతను వివరించాం. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
-రామారావు, ప్రిన్సిపాల్, నయాబజార్ జూనియర్ కాలేజీ, ఖమ్మం
పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి
ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. కొవిడ్ రక్షణ చర్యలతో పాఠశాలలకు పంపిస్తాం. ఇప్పటికే కొవిడ్ మహమ్మారితో పిల్లలు విద్యాసంవత్సరం కోల్పోయారు. పాఠశాలలో నిరంతరం పిల్లల ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలి.
-నాగేశ్వరరావు, విద్యార్థి తండ్రి, గుదిమళ్ల