
ఖమ్మం జిల్లాలో 1,95,571 మందికి అందిన పెట్టుబడి సాయం
జోరందుకున్న యాసంగి వ్యవసాయ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
విత్తనాలు, ఎరువులు కొంటూ బిజీ బిజీ
జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
ఖమ్మం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు మురిసి మెరిసిపోతున్నారు. రైతుబంధు పథకం అన్నదాతల మోముల్లో చిరునవ్వులు చిందిస్తున్నది. ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండడంతో కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. రెండు రోజు లుగా తెలంగాణ సర్కార్ యాసంగి సాగుకు అవసరమైన పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో ఆనందంతో పరవశిం చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంగళవారం నుంచి రైతు బంధు ప్రక్రియ మొదలు కాగా బుధవారం లోపే 1,95 571 మంది కర్షకులకు సర్కారు రూ.98.11 కోట్ల సొమ్ము జమ చేసింది. రైతులు ఏటీఎంలు, బ్యాంకుల నుంచి పెట్టుబడి సాయాన్ని డ్రా చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని దుకాణాల వద్ద రైతుల రద్దీ కనిపిస్తున్నది. జనవరి మొదటి వారం లోపు జిల్లాలోని 3,16 422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ 362.84 కోట్లు జమకానున్నాయి.
యాసంగి సీజన్ మొదలైంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని జమ చేస్తున్నది. మంగళవారం జమ ప్రక్రియ మొదలు కాగా బుధవారం లోపే 1,95 571 మంది రైతులకు సర్కారు రూ.98.11కోట్ల సొమ్ములు జమ చేసింది. రైతులు ఏటీఎంలు, బ్యాంకుల నుంచి పెట్టుబడి సాయాన్ని డ్రా చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయ పనుల జోరు పెంచారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని దుకాణాల వద్ద రైతుల రద్దీ కనిపిస్తున్నది. జనవరి మొదటి వారం లోపు జిల్లాలోని 3,16 422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ 362.84 కోట్లు జమకానున్నాయి.
అప్పుల ఊబి నుంచి బయటపడిన రైతాంగం
ఉమ్మడి రాష్టంలో వ్యవసాయరంగం కుదేలైంది. పండించిన పంటకు మద్దతు ధర లేక, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ రైతుల బాగోగులను పట్టించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నారు. తద్వారా చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నారు. ఈ పథకాలను జిల్లావ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలైంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం జమ అవుతున్నది. రైతాంగం వడ్డీ వ్యాపారులు, అప్పుల అవసరం లేకుండానే సాగు పనులు ప్రారంభించారు. గడిచిన నాలుగేండ్లుగా దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నట్లుగానే ఈ యాసంగిలోనూ సాగు పనులు సజావుగా చేసుకుంటున్నారు. సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందుతుండడంతో జిల్లాలో యాసంగి సాగు పనులు వేగవంతం కానున్నాయి. వ్యవసాయశాఖ గణంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా యాసంగిలో 44,120 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. వరి 3,587 ఎకరాల్లో సాగవుతుంది. కంది కేవలం 23ఎకరాలు, కంది అంతర పంటగా మరో 30 ఎకరాల్లో ప్రారంభమైంది. అలాగే పెసర 713 ఎకరాలు, మక్కలు 37,196 , వేరుశనగ 1,536, చెరుకు 161 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. మరో 250 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. పత్తి 10,134 ఎకరాల్లో ప్రారంభమైంది. ఇలా ఇప్పవరకు 21,800 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వానకాలంలో వానాలు బాగా కురవడం, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, పాలేరు రిజర్వాయర్, భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి సాగు జలాలు విడుదలవుతుండడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పాయి.
దేశానికే ఆదర్శం రైతుబంధు;రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్
ఖమ్మం, డిసెంబర్ 29: రైతుబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పరితపిస్తారన్నారు. యాసంగి ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు క్షీరాభిషేకం చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో 3,16,422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.362.84 కోట్లు జమ కానున్నాయన్నారు. ఇప్పటివరకు 8 విడతల్లో రైతులకు వేలాది కోట్ల సాయం అందిందన్నారు.
దర్జాగా సాగు చేసుకుంటున్నా..
నేను గతేడాది వానకాలంలో ఐదెకరాల్లో మిరప సాగు చేశా. ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.25 వేలు పెట్టుబడి సాయం అందింది. చీడపీడల కారణంగా పంట నష్టపోయా. సాగు కష్టమే అని భావించా. మళ్లీ యాసంగికి రూ.25 వేలు అందింది. కొద్దిగా కోలుకున్నా. తిరిగి ఈ ఏడాది వానకాలంలో రూ.25 వేలు పెట్టుబడి సాయం అందింది. రెండు పంటలు సాగు చేశా. పెట్టుబడులు, కుటుంబ ఖర్చులు పోను మిగిలిన సొమ్ముతో డ్రిప్ ఫిల్టర్ కొన్నా. యాసంగిలో రూ.25 వేలు అందాల్సి ఉన్నది. ఇలా రైతుబంధు పథకం ఆదుకుంటూనే ఉన్నది. ప్రభుత్వ సాయం అందకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఇప్పుడు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నా. గత ప్రభుత్వాలు రైతులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి. పంటలకు విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. రైతులు ఆత్మహత్య చేసుకునే వారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు స్వరూపమే మారింది. చెరువుల్లో పూడికతీతతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతుబీమా, రుణమాఫీ, రైతుబంధు పథకాలతో భరోసా వచ్చింది.