
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యానికి భట్టి విక్రమార్కనే కారణం
ప్రశ్నించిన జడ్పీ చైర్మన్ లింగాల,ప్రజాప్రతినిధులపై దాడి
బోనకల్లు, అక్టోబర్ 29: పేదలకు అందే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యానికి మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కారణమని ఖమ్మ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ప్రజాప్రతినిధులు, ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మీదకు నీళ్ల బాటిల్ విసిరేశారు. బోనకల్లు మండల కేంద్రంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం తహసీల్దారు రావూరి రాధిక అధ్యక్షతన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు వేదికపై కూర్చుకున్నారు. జడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పంపిణీలో జాప్యానికి కారణం ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క కారణం కాదంటూ చెప్పబోయారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు కలుగ జేసుకుని మూడు నెలల క్రితం లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా ఇప్పటివరకు చెక్కుల పంపిణీ ఎందుకు జరగలేదని తమ వద్ద కొన్ని ఆధారాలను చూపించారు. జడ్పీ చైర్మన్ లింగాల్ కమల్‌రాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లల వివాహానికి రూ.1,00,116 కల్యాణలక్ష్మి ఇస్తున్నారన్నారు. చెక్కుల పంపిణీలో జాప్యం తగదని హితవు పలికారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా సమావేశ వేదికపై దూసుకువచ్చారు. వేదికపై ఉన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై నీళ్ల బాటిళ్లు విసిరేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆందోళనకారులను బయటకు పంపించారు. మొత్తం 113 మందికి చెక్కులు ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఇద్దరికి మాత్రమే చెక్కులు ఇవ్వగలిగిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు ఉసూరుమంటూ స్వగ్రామాలకు వెళ్లిపోయారు.