
వరద నీటిని బయటకు పంపిస్తేనే ప్రయోజనం
తెగుళ్ల నివారణకు పురుగు మందుల పిచికారీ చేయాలి
వైరా కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్
యాజమాన్య పద్ధతులు పాటించాలి
భద్రాద్రి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 29: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గులాబ్ తుఫాన్ కారణంగా అధిక వర్షాలు కురుస్తుండడంతో సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 160.7 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా మంగళవారం 285.7 మిల్లీమీటర్లు నమోదైందని వైరా కృషి విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. దీంతో వానకాలం సాగుచేసిన పత్తి, వరితో పాటు మిర్చి తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అయితే సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘నమస్తే తెలంగాణ’ వివరించారు.
పూత, పిందె దశకు చేరిన పత్తి పంటలో..
ప్రస్తుతం పత్తి పంట.. పూత, పిందె దశల్లో ఉంది. సాధ్యమైనంత వరకు పంట చేలలో వరద నీటిని తక్షణమే బయటకు పంపించాలి. ఎర్రబడిన చేలలో పొటాషియం నైట్రేట్ 100 గ్రాములు, లేదా 19-19-19 లీటరు నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో వేరుకుళ్లు వచ్చే ప్రమాదం ఉన్నందున 3 గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్, లేదా ఒక గ్రాము కార్బండైజమ్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకుమచ్చ తెగులు ఆశించే ప్రమాదం ఉన్నందున కాఫర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటామైసిన్ ఒక గ్రామును.. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
వరద నీటిని బయటకు పంపాలి..
వరద నీటిని తక్షణం బయటకు పంపిస్తేనే వరి పొలాలకు ప్రయోజనం. పూత దశలో ఉన్న వరికి ఎండు తెగులు ఆశించే ప్రమాదం ఉంది. నివారణ కోసం కార్బండిజమ్ ఒక గ్రాము, లేదా, ప్రోపికోనిజల్ ఒక మిల్లీ లీటరును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు, మెడ విరుపు లక్షణాలు గుర్తించినట్లయితే ట్రైసైక్లోజెల్ 0.6 గ్రాము, లేదా కానుగమైసిన్ 2.5 మిల్లీలీటరును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పాముపొడ సైతం ఆశించే ప్రమాదం ఉన్నందున దాని నివారణకు ప్రోపికోనిజల్, ట్రైసైక్లోజెల్ 0.4ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మిర్చి తోటలకు సస్యరక్షణ చర్యలు
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మిర్చితోటను తిరిగి కాపాడుకోవడానికి అవసరమైన సస్యరక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలి. తొలుత తోటల్లో వరద నీరు నిలిచి ఉన్న పక్షంలో ఆ నీటిని వెంటనే బయటకు పంపించాలి. కాండం కుళ్లు తెగులు ఆశించే ప్రమాదం ఉన్నందున దాని నివారణకు థయోఫాసెట్ మిథైల్ 1.5 గ్రామును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాఫర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు సైతం ఆశించే ప్రమాదం పొంచి ఉన్నందున కాఫర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి తెగులు ఆశించిన మొక్క ఆకులతోపాటు, కాండం చుట్టూ తడుపుకోవాలి. ఇకపోతే లద్దెపురుగు నివారణ కోసం థయోడికార్బ్ 1.5 గ్రాములు, ప్లూ బెండ్మైడ్ 0.2 మిల్లీ లీటరును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.